పుట:Ganapati (novel).pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

గ ణ ప తి

నక్కడకీడ్చుకొని పోవజొచ్చెను. జూదపుబాక జగన్నాయకపురములో సముద్రపు టొడ్డున నొక మూలగ నుండెను. గంగాధరుఁడు పనిలేనప్పుడు పట్టపగలును; పగలు పనియున్నపుడు తప్పక రాత్రివేళను భాగ్యవంతుని నిర్భాగ్యుని, నిర్భాగ్యుని భాగ్యవంతుని క్షణ కాలములో జేయగల యాద్యూత గృహమునకుఁ పరమభక్తుఁడు దేవాలయమున కరిగిన ట్లరగి యోపిక యున్నంత సమర్పించి వచ్చుచుండును. అతఁడు తీరికగనున్న కాలము సింహాచలము గృహమునకు ద్యూతగృహ్యమునకు సమానముగ విభజించెను. ఇప్పుదు సింహాచలయాత్ర కట్టుబడి పోవుటచే తత్కాలముఁగూడ ద్యూతగృహమునకె వినియోగింపఁ జొచ్చెను.

ఇట్లుండఁ బూర్వము తెనాలి రామలింగము యొక్క పిల్లికి పాలు చూడగనె భయము గలిగినట్లు జూదపుబాక పేరు చెప్పఁగానె గంగాధరున కడలు పుట్టించునట్టి వైపరీత్యమొకటి జరిగెను. ఒక యమావాస్య నాటిరాత్రి యేడెనమండుగురు జూదగాండ్రు మైమరపించు సంతోషముతో జూదమాడ నారంభించిరి. పొరుగూరి నుండి వచ్చిన యొక కాఁపువాఁడు నాటిరాత్రి లక్ష్మీకటాక్ష సంపన్నుఁడై యైదువందల రూపాయలు గెలుచు కొనెను. ఓడి పోయినందువలన గలిగిన పరాభవమునకుఁ దోడై ధన నష్టము జూదగాండ్రకు మేరలేని మత్సరము గలిగించెను. ఆ కాఁపువాడు గెలిచిన విత్తము మూటఁగట్టుకొని స్వగ్రామమునకుఁ బోవ సమకట్టెను. మరల