పుట:Ganapati (novel).pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

107

చించుండ నంతలో గంగాధరుఁడు దానందుకుఁ దగిన వాడననిచెప్పి గ్రామపురోహితులను సభాపతులను నాశ్రయించెను. వచ్చిన దానిలోఁ గొంతభాగము వారి కిచ్చునట్లు గంగాధరు డొడంబడినందున వారా పదవి కితనినె పట్టాభిషిక్తుని జేసి యెఱిగినచోట్ల "నితఁడు మనల నందఱ నమ్ముకొన్నాఁడు గనుక నితనికే యియ్యవలయు" ననిచెప్పి యెఱుఁగనిచోట్ల నితడి పిల్లలు కలవాడు, బహుకుటుంబీకుఁడు పెద్దమనుష్యుఁ డని చెప్పి యెట్లో వా రీయఁదలంచుకొన్న దానికన్న నధికముగ నిప్పించి యుపకారముగ జేయఁజొచ్చిరి. అట్లు వచ్చిన ధన మతఁడు నాలుగు భాగములుగ విభజించెను. "శరీర మాద్యం ఖలు ధర్మసాధన" మన్నారు గనుక నొక భాగము తన సంరక్షణము నిమిత్తము, రెండవభాగము తనకు దానము లిప్పించిన పురోహితుల నిమిత్తము, మూడవభాగము తనకు బాహ్యప్రాణమైన సింహాచలము నిమిత్తము, నాల్గవ భాగము నిరుపేదయైన తన్ను నలచక్రవర్తి యంత వానిని జేసిన జూదము నిమిత్తము నతండు వినియోగించు చుండెను. ఈ వృత్తి యవలంబించిన తరువాత నెప్పటి కప్పుడు కావలసినన్ని ధాన్యము, లెక్కలేనన్ని పీటలు, నెంచరాని చెంబులు తినుటకు వీలులేనన్ని యరటికాయలు కందదుంపలు మొదలగు కూరలు విశేషించి యెన్నోమంచములు నెన్నో పరుపులు నెప్పటి కప్పుడు రొక్కము, కావలసినన్ని బియ్యము మొదలగునవి చేకూరఁ జొచ్చెను. ఎప్పటి కప్పుడీ వస్తువులతో