పుట:Ganapati (novel).pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

గ ణ ప తి

చిరకాల మన్నవస్త్రము లిచ్చి సకలసౌఖ్యము లిచ్చి పోషించిన కావడిబద్దను మట్లను మూలఁ బాఱవైవలసి వచ్చినప్పుడు సంపూర్ణ శస్త్ర సన్యాసము జేయు మహావీరుఁడు వలెను గదాగాండీవములు జమ్మిచెట్టుమీఁద దాఁచిన భీమార్జునుల వలెను గంగాధరుఁడు కన్నులనుండి జొటజొట బాష్పములు దొఱఁగ నేడ్చి యటమీఁద నుదరపోషణ మెట్లని విచారింపఁ జొచ్చెను. అతని చేయి విరిగిన దినములలోనె మాతామహుఁడైన యన్నప్ప యవతారముఁ జాలించెను. తండ్రి తన్నథో గతిపాలుచేసినను సహజమైన పితృ ప్రేమచేఁ బిచ్చెమ్మ కొంత వగచి యొకసారి తల్లిని జూడఁదలఁచెను. కాని కుమారున కన్నము దినిపించువారు లేకపోవుటచేతను విశేషించి గంగాధరుఁడు వెళ్ళఁదలఁచినందుకు మిక్కిలి దూషించుటచేతను మానుకొనియెను. గంగాధరుని భవిష్యద్వృత్తిని గూర్చి తల్లికి గూడ మనోవ్యధ కలిగెను. అందఱికంటె సింహాచలమున కెక్కువ విషాద ముదయించెను. గంగాధరుఁడు పరిత్యజించిన పక్షమునఁ గాకినాడ పట్టణములో దాని మొగముఁ జూచువారు లేరు. కావున దాని విచారమున కంతములేదు. నారు వోసిన దేవుడు నీరు పోయకమానఁడని గంగాధరునకు గట్టినమ్మకము కలదు. అతని విశ్వాస ప్రకారమె యతని కదృష్టము కలిసి వచ్చెను. కాకినాడలో నదివఱకు నగ్నిప్రచ్ఛాదనములు, తిలదానములు పట్టుచుండిన బ్రాహ్మణు డొకడు మృతినొందెను. ఆ స్థానమాక్రమించుటకుఁదగినవా రెవ్వరని పురవాసు లాలో