పుట:Ganapati (novel).pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

105

తోడపడకపోయిన తరువాత మానవప్రయత్న మేమి సాగును? గంగాధరుఁడు దృఢశరీరము గలవాఁ డగుటచే నతని శరీరభారమున గోడ విరిగిపడెను. గోడలో గంగాధరుఁడు గూలెను. కుడిచెయ్యి విరిగెను. పడగానే కొంచముసేపు స్మృతిదప్పెను. వీధివైపునకుఁ బడినందున దారిబోవువా రెవరో చూచి గంగాధరుఁ డని తెలుసుకొని యొక బండిమీఁదఁ బడవైచి యింటికిఁ దీసికొనిపోయిరి. కొన్ని దినము లతఁడు మంచముమీద నుండి లేవనేలేదు. ఆసుపత్రికి వెళ్ళి వైద్యము జేయించుకొమ్మని కొంద రతనికి సలహా యిచ్చిరి. కాని యాసుపత్రి వైద్యులను దొరతనమువా రభిమానముచేత నిలుపుచున్నారు. కాని వారికి వైద్య మేమియుఁ దెలియదని మొదటనుండియు నతని నమ్మిక యగుటచే నతఁడా పొంతఁ బోవక కుమ్మరగురవయ్యను బిలిపించి ఏఁబదిరూపాయలిచ్చుట కొప్పుకొని చేయి వానిచేత తోమించుకొన నారంభించెను. చెయ్యి యెకవిధముగ స్వాధీన మగునప్పటి కారుమాసములు పట్టెను. ఆ యారుమాసములు తల్లి యన్నము దినిపించెను. ఏడవమాసమున నతని కన్నము దినుటకు మాత్రము చేయి స్వాధీనమయ్యెను. కావడి మోయుటకు బిందె లెత్తుటకు నది స్వాధీనము గాకపోయెను. కాఁబట్టి కాకినాడ పురజనుల భాగ్యదోషమున గంగాధరుఁడు పూర్వపు వృత్తి వదలవలసి వచ్చెను. తల్లి యక్కడక్కడ పనిచేసి యీ యాఱుమాసములతనిని బోషించెను. పైగా నూరురూపాయ లప్పయ్యెను.