పుట:Ganapati (novel).pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

103

గలిగి యతని మోకాలంత పొడుగై నలేని చిన్న బ్రహ్మచారులకు ముట్టినంత సొమ్మేముట్టెను. గంగాధరునివంటి ప్రజ్ఞాశాలికి మహాభిమానికి నిదియొక గొప్ప యవమానముకాదా? కన్యా ప్రధాన కాలమున జరిగిన యవమానమున కిది తోడై యతని మనస్సు మఱింత మండింపఁ జేసెను. వివాహము కాని వెలితి యప్పుడతనికిఁ గనఁబడెను. క్రతువులను జేసిన సోమయాజు లగ్నిగోత్రము నిమిత్తము వివాహము చేసికొన వలసి వచ్చినట్లు సంభావనల నిమిత్తము గంగాధరుడు వివాహము జేసికొన వలయునని యప్పుడు నిశ్చయించుకొనెను. సింహాచల మతనికి భార్యయై యుండినను భార్య యున్నదని చెప్పుకొనుటకు వొంటిపోగు జందెము దీసి నాలుగుజందెములు వేసికొనుటకు వీలులేదుకదా. పెండ్లి వా రర్థరూపాయ చేతిలోఁ బెట్టగానే విధిలేక యది పుచ్చుకొని గంగాధరుడు మనస్సులో నున్న మంటయొక్క పొగ యేమో యన్నట్లు కనుబొమలు బిరుసులై విజృంభింప ధుమధుమ లాడుచు నా వలకు బోయెను. ఆ దినమున సింహాచలము రెండురూపాయలు తెమ్మని యాజ్ఞాపించెను. పెండ్లివారు గొప్పవారు కదా రెండేసి రూపాయలిత్తురని యతఁడు నిశ్చయించుకొని వెళ్ళెను. కాని చేతిలోఁబడిన దర్థరూపాయి మాత్రమె యయ్యెను. రెండురూపాయలు దీసికొనివెళ్లక పోయినచో సింహాచలము చీపురుగట్టపూజఁ జేయును. అదీ మనసుపడి యొక వర్తకుని యొద్ద గులాబీరంగు పట్టురవికెల గుడ్డ వెలకుఁ