పుట:Ganapati (novel).pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

గ ణ ప తి

ధరున కెంతకోపము వచ్చినదని చెప్పను? "ఛీ! మీకు విశ్వాసము లేదు. ఇకమీద మీ యిండ్లలో నీళ్ళు మోసితినా కాశీలో గోహత్య జేసినట్లె" యని మహాకోపముతో వారియిండ్లు వెడలివచ్చి "యొక నిర్భాగ్యుఁడు నాకు సిఫారసు చేయుటెందుకు? దేవుఁడిచ్చిన కాళ్ళు చేతులు నుండఁగా నొకరి నాశ్రయింపనేల" యని మఱెవ్వరిని సిఫార సడుగక స్వయం సహాయమె మంచిదని తత్ప్రయత్నముఁ జేయుచుండెను. సదస్యమునాడు బ్రాహ్మణసంతర్పణ మైనతరువాత సంభావన సాయంకాల మీయఁదలఁచి పెండ్లివారు భోజనానంతరమున బ్రాహ్మణులు నందఱ నొకదొడ్డిలోఁ బెట్టిరి. రెండువేల బ్రాహ్మణ్యము చేరెను. ప్రతివాఁడు ముందుగా సంభావన గ్రహింపవలయునని యొండొరులఁ ద్రోసికొనుచు ద్రొక్కికొనుచు విసనగఱ్ఱలతోఁ గొట్టుకునుచుఁ దిట్టికొనుచు బ్రాహ్మణులాకాశము పగులుతున్నట్లురచుచుండిరి. సంభావనలిచ్చుటకు మొదలు పెట్టునప్పటికి సాయంకాల మయ్యెను. గంగాధరుఁడు దృఢదీర్ఘ కాయుఁడగుటచేఁ దనకంటె ముందున్నవారి నెందఱినో వెనుకకు లాగివైచి ముందుకు వెళ్ళిపడి తన సంభావనకుఁ చేయిచాచెను. పెండ్లివారు వివాహ మైనవారికి రూపాయి చొప్పున బ్రహ్మచారుల కర్థరూపాయి చొప్పునను నీయఁదలఁచిరి. పాపము ! గంగాధరుఁడు ముప్పదియేండ్ల వయసువాఁడై చిన్న తాడిచెట్టంత పొడుగున్నను వివాహితుఁడు కాకపోవుటచే నేఁ డెనిమిది సంవత్సరముల వయసు