పుట:Ganapati (novel).pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

గ ణ ప తి

పురవాసులు చేసికొన్న దురదృష్టము వలన సంభవించినది. ఆపట్టణమందొక గొప్పవైశ్యునియింట వివాహము జరిగెను. విజయ నగరమునుండి మగపెండ్లివారు తరలివచ్చిరి. కన్యాప్రదాత లక్షాధిపతి, వరుని తండ్రియు నట్టివాడె. సుముహూర్త సమయమున వందల కొలది జామారులు శాలువలు పెద్దకాసులు పిల్లకాసులు కన్యా ప్రదాత సభలో వెదజల్లెను. కుండలములు ధరించినవారికి రుద్రాక్షలు దాల్చినవారికి పిండికట్టుపెట్టినవారికి పిల్లజుట్లవారికి దర్భాసనాల వారికి సిఫారసులు దెచ్చికొన్నవారికిని నివిశేషముగ ముట్టెను. అందు గంగాధరున కొక్కటియు ముట్టలేదు. అతని కెవ్వరు సిఫారసు చేయలేదు. అందుచేతఁ గాకినాడ పురవాసు లందరు గృతఘ్నులని యతఁడెంచుకొనెను. చెంబు చేతితో నెత్తి కాకినాడలో దాహము పుచ్చుకొన్న వారిలో ననేకులు గంగాధరునిపేరు తలంచుకొనవలసినదేకదా. వేదశాస్త్రములు రాక వెర్రికుక్కలవలె వీధులవెంటఁ దిరుగ బండవాండ్ర కెందఱకు మొగమాటమి చేత సిఫారసులచేత బండితసంభావనలు జామారులు ముట్టలేదు? అదివఱకు వెంకన్న సుబ్బిగాడు గంగన్న యను పేర్లుగల నిరక్షరకుక్షులు నీళ్ళ బ్రాహ్మణులు వంటబ్రాహ్మణులు నాఁ డాహితాగ్నులై వెంకటావధానులు, సుబ్బన్న దీక్షితులు, గంగప్ప సోమయాజులు నను బిరుదులు ధరించిరి. ఎన్నో దర్భాసనముల బూజు దులుపఁబడెను. ఎన్నో జారీ చెంబులెఱ్ఱగాఁ దోమబడి హస్తముల యందమరెను. ఎన్నో