పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వద్దని వదిలించుకున్నా, విదిలించుకున్నా వదలక చుట్టుకునేదే ప్రారబ్ధము. అది మంచో, చెడో నిర్ణయించుకునేది ఆలోచనలకు బంధుడై బద్ధుడైన జీవుడు, తన ప్రారబ్ధాదానికింకెవరో కారకులనడం అమాయకత్వం. తన భావనలే, ఆచరణలే, తనను నడిపిస్తున్నాయని, అలాగే యితరుల విషయంలోనని కూడా తెలుసుకోగలిగితే - ఇక వాదనలకు, వివాదములకు, వింత వింత పోకడలకు, విమర్శలకు, తావుండక - వివేకానికి దారి తీస్తుంది. ఇదే భావన ఆలంబనమై ఈ క్రింది వాక్యాలు ఎలా స్పందింప జేస్తాయో........................................(?)

పూజ్యపాద ప్రేమ స్వరూపులగు తల్లిదండ్రులకు (రచయిత, ప్రోత్సాహక దంపతులకు) - ఈ బిడ్డకు మధ్య పరమాత్మ వేసిన బంధము - ఋణానుబంధము మాత్రంకాదు. ఆత్మానుబంధము యొక్క ప్రతిస్పందనే కదలని కలాన్ని కదిలించింది. వీటన్నిటి వెనుక అదృశ్యంగా వుండి నడిపిస్తున్న శక్తి ఏదో వుందని అనిపిస్తుంది, కానీ తెలియదు. చూడలేదు. కనుక వుందని నిర్భయంగా చెప్పలేను. అందుకే జన్మకారకులు, జన్మచరితార్థకారకులు నగు తల్లిదండ్రుల పావన పదపద్మములకు కృతజ్ఞతతో, ప్రేమతో శిరసా నమస్కరిస్తున్నాను. నాకు మాతృభాషయే సరిగ్గారాదు. వ్యాకరణం రాదు. వ్యావహారికం రాదు. గ్రామ్యము, దేశ్యములసలేరావు. మరి నాకొచ్చిన దేమిటంటే అన్నీ కలియబోసిన భాష. దానికి మీరేమి పేరు పెట్టుకున్నా నాకంగీకారమే. అందువలన భాషకు, భావములకు వీడే బాద్యుడు.

క్లుప్తంగా రెండు వాక్యాలు. ఈ శ్రీముఖంలోని భావాలు కేవలం ఈ జీవి పరిమిత బుద్దివే. నృశంసనములు మాత్రం స్వీకరించడానికి సంసిద్దత వ్యక్తపరుస్తూ వీలైనంతమంది తమ నృశంసనములను పంపించవలసినదిగా ప్రార్థిస్తూ ఇక మొదలిడతాను.