పుట:Gaanaamritamu (1897).pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉపోద్ఘాతము.

3



నియమంబులేదు. మున్ను పరమభక్తాగ్రేసరులగు శ్రీనారాయణతీర్థస్వాముల వారు శ్రీకృష్ణభగవానుల శృంగారరసభరితసంగీతములతోఁ 'గృష్ణలీలాతరంగిణి' యను గ్రంథమురచించి యనేకముఖంబులస్తుతించి సగుణబ్రహ్మసాక్షాత్కారముఁ గాంచి తత్వనిష్ఠాగరిష్ఠులై జీవన్ముక్తులయి తరువాత విదేహముక్తిఁ జెందలేదా? వారిజ్ఞానసంపదకాసగుణోపాసన రవంతయే నంతరాయము కలుఁగఁజేయనేర్చెనా? ఆగ్రంథాంతంబున నుపనిషద్రహస్యముల సంగీతరూపముగాఁ బ్రచుర పఱుచుటయే వారిజ్ఞానవైరాగ్యభాగ్యము సూచించుచున్నది. శ్రీజయ దేవకవీంద్రుఁడు శ్రీకృష్ణుని శృంగారచరిత్రమును శ్రోత్రపేయముగా "గీతగోవింద" మనుపేరిట రచించి యనేకవిధంబుల నారాధించి జ్ఞానధనుఁడై యౌపనిషద్రహస్యములఁ గొల్లఁగావెల్లడిచేయుచుఁ "బ్రబోధచంద్రోదయ"మను వేదాంత నాటకంబు రచించి తనయంతేవాసినుద్ధరించి బ్రహ్మభావంబు సంపాదింపలేదా? అట్టిగ్రంథంబులమ్మహనీయుల కుపకారమ్ములు కాకపోయెనా? భగపదుపాసన యేవిధముగా నైన నుపకారము చేయకమానదు. ఇట్టియభిప్రాయంబు మనంబునం బెట్టియే శ్రీమహారాజరాజశ్రీ శ్రీరాజా మంత్రిప్రగడ భుజంగరావు బహద్దరు జమీందారుగారు శృంగారరసప్రచురముగా నీ "గానామృత" మను గ్రంథమును రచించినారు. వారును శాంతరసప్రధానత్వము సూచింపఁదలంచియే యుపక్రమోపసంహారముల యందుఁ దత్వప్రతిపాదకంబులగు నుతివచనంబుల రచించినారు. శ్రీవారు గోదావరీమండలస్థమగు నేలూరునందునివాసమేర్పఱుచుకొని, లక్కవరము, బయ్యెనగూడెము, బిళ్లుమిళ్లి, వెల్ల, మున్నగు ప్రదేశముల నేలుచు, సతతము శివాసక్తింవ్రతముల సల్పుచు నిగర్వశిరోమణియు, సరసులునై, యాంధ్రభాషాయోషామణింజేరఁదీసి మిక్కిలి గౌరవనీయులుగా నెన్నఁదగియున్నారు. (1) మార్కండేయశతకము (2) శ్రీహరిశతకము (3) ఈశ్వరశతకమునను శతకత్రయమును, పిదప 'నలనాటకము'ను, రచించిరి. ఇప్పుడు 'శృంగారరస వాహిని' యనుపేర నొక నూతనప్రబంధమును రచించుచున్నారు. ప్రస్తుత