పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

235

పదునేనప ఆధ్యాయము


టెంపిలు కోట బయట నిలువ పెట్ట బడి యున్న గుర్రపు బండిలో సాంటెరితొ కూడ లూయీ రాజెక్కి యొక గంటలో ఉరి తీయు స్తలమగు ప్లాసిడివల్యూషన్ కు వచ్చెను. త్రోవ పొడుగున నిరు ప్రక్కలను ఆయుధ పాణులగు షుమారేబది వేల మంది సైనికులు కాపుదల కాయు చుండిరి. ప్యారిసు పట్టణమంతయు నిశ్చేష్టితముగ నుండెను. ఉరి ప్రదేశమునకు చూడ వచ్చిన ప్రజలు సంతోషము గాని, విచారమును గాని వెలి బుచ్చక నిశ్శబ్దముగా చూచు చుండిరి. లూయీ గుర్రపు బండి దిగెను. స్థైర్యముగా నురి స్థంభముపై నెక్కెను. మతాచార్యుని దీవనను గైకొనుటకు మోకరించెను. "సెంటు లూయీ కుమారుడా స్వర్గమునకు బొమ్ము" అని మతాచార్యు డాశీర్వదించెను. లూయి తన చేతులు బంధింప బడుటకు కొంచెమయిష్టతను చూపెను. తరువాత నొప్పుకొనెను. ఉరి స్థంభము యొక్క ఎడమ ప్రక్కకు తొందరగా వెళ్ళి "నేను నిర్దోషిగా చని పోవు చున్నాను. నాశత్రువులను నేను క్షమించు చున్నాను. దురదృష్టవంతులగు ప్రజలారా............... " అని లూయి చెప్ప బోవు చుండగా ఆయన చెప్పునది వినబడకుండ తప్పెటలు వాద్యములు మ్రోగించబడెను. వెంటనే ముగ్గురు శిరచ్చేదకులు వచ్చి ఆయనను పట్టుకొనిరి. 1793 వ సంవత్సరము జనవరి 21 వ తేదీన ఉదయము పది గంటల పదినిముషములకు లూయీ ప్రాణములను విడిచెను.