పుట:February 2020.అమ్మనుడి.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మధ్యతరగతి ముందు పెడితే అధికార పార్టీలు ఆంగ్ల మాధ్యమాన్ని బడుగు బలహీన వర్గాల ఓటర్లకు ఎరవేయడానికి ఉపయోగిస్తున్నాయి. గుర్తించవలసిన విషయం ఏమంటే, ప్రైవేటు పాఠశాలలలో ఆంగ్ల మాధ్యమం ఉన్నన్నాళ్ళు ప్రభుత్వ పాఠశాలలపై ఆంగ్ల మాధ్యమ కత్తి వేలాడుతూనే ఉంటుంది. మధ్య తరగతి ఏది నాగరికత అంటుందో దానినే బడుగు మరియు బలహీన వర్గాలవారు నాగరికతగా భావిస్తారు. మాధ్యమం విషయంలో మధ్యతరగతి అవగాహన మారనిదే బడుగు, బలహీన వర్గాల అవగాహన మారదు. అవగాహనా రాహిత్యం వలన ప్రజలు, దురుద్దేశాలతో పాలక శక్తులు ఒకే వైపు నిలబడిన దురదృష్టకర సందర్భం ఇదని ముందుగానే చెప్పుకున్నాం.

ఆంగ్ల మాధ్యమానికి అనుకూలంగా చేయబడుతున్న వాదనలన్నింటినీ నేను ఇక్కడ పేర్కొనడం లేదు. ఒక్క విషయం మాత్రం ప్రస్తావిస్తాను. ఉన్నత విద్యలకు, ఉద్యోగాలకు ఆంగ్లం అవసరమేకదా అనే వాదన ఉంది. ఇది కొంతవరకు సహేతుకమైనదే. అయితే ఆంగ్ల మాధ్యమానికి మరియు ఆంగ్లం నేర్చుకోవడానికి ఎటువంటి సంబంధం లేదు. ప్రైవేటు రంగంలో లేదా ప్రభుత్వం రంగంలో బాలలకు ఆంగ్లాన్ని నేర్పడానికి ఆంగ్లాన్ని ఒక పాఠ్య విషయంగా బోధిస్తే చాలు. ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే, ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలన్నింటిలో ఒకటవ తరగతి నుంచి ఆంగ్లం ఒక పాఠ్య విషయంగా ఉంది. కాని ప్రత్యేక అర్హతలు మరియు శిక్షణ కలిగిన ఉపాధ్యాయులు ఎక్కడా లేరు. అందుకే రాష్ట్రంలో బాలలకు వారు ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలలో ఏ పాఠశాలలో చదివినా ఆంగ్లభాష రావడం లేదు. ప్రభుత్వ పాఠశాలలలో విద్యాహక్కు చట్టానికి అదనంగా ఆంగ్లభాషా బోధనకు ఒక ఉపాధ్యాయ పోస్టు ఇవ్వాలన్న విద్యారంగ ఉద్యమాల సూచనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నిజానికి బాలలకు ఆంగ్లం నేర్చాలనే పట్టుదల ప్రభుత్వానికి ఉందని విశ్వసించడం కష్టం.

2019లో కస్తూరి రంగన్‌ కమిటీ ఇచ్చిన విద్యా నివేదికలో (జాతీయ విద్యావిధానం 2019 ముసాయిదా) ఎనిమిదవ తరగతి వరకు అన్ని యాజమాన్యాల పాఠశాలలలో మాతృభాషా మాధ్యమాన్ని అమలు చేయమని సిఫారసు చేసింది. అంతేకాదు 12వ తరగతి వరకు కూడా మాతృభాషా మాధ్యమాన్నే అమలు చేయాలని, అయితే విజ్ఞాన శాస్త్రాలలో సాంకేతిక పదాలను సమాంతరంగా ఆంగ్లంలో కూడా 9వ తరగతి నుంచి పరిచయం చేయాలని, ఉన్నత విద్యలకు వెళ్ళినప్పుడు ఆంగ్ల మాధ్యమంలోనికి వెళ్ళవలసి వస్తే విద్యార్థికి ఎటువంటి ఇబ్బంది ఉండదని వివరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నివేదిక ఆధారంగా ఫైవేటు పాఠశాలలో కూడా మాతృభాషా మాధ్యమాన్ని అమలు చేయవచ్చు. ఇక ఉద్యోగావకాశాలకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వగలిగే లక్షలాది ఉద్యోగాలకు, కల్పించగలిగే పదుల లక్షల ఉపాధులకు ఆంగ్లంతో నంబంధం లేదు. ఎ.పి.యస్‌.ఇ.బి మరియు ఎ.పి.యస్.ఆర్‌.టి.సి వంటి సంస్థలలో ఉద్యోగాలకు, అత్యధిక ప్రభుత్వ పాఠశాలలలో ఉద్యోగాలకు, పోలీసు శాఖలో ఉద్యోగాలకు ఆంగ్లంతో పనిలేదు. బ్యాంకు ఉద్యోగాలకు కూడా మాతృభాషా మాధ్యమంలో చదువు సరిపోవడమే కాదు అవసరం కూడా. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా తెలుగులో పోటీ పరీక్షలు వ్రాయవచ్చు. ఇక మిగిలినవి ఐ.ఐ.టిలు మరియు అమెరికా ఉద్యోగాలు. ఐ.ఐ.టిలలో సంవత్సరానికి 10 వేల సీట్లు ఉంటాయి. ప్రస్తుతానికి రాష్ట్రాలవారిగా కోటా లేదు కాబట్టి ఉభయ తెలుగు రాష్ట్రాలకు కలిపి సుమారు రెండువేల సీట్లు వస్తున్నాయి. కోటాలు విధిస్తే తెలుగు రాష్ట్రాలకు వచ్చేవి గరిష్టంగా వెయ్యి సీట్లు మాత్రమే. అమెరికా ఉద్యోగాలకు కావలసింది ఆరు మాసాల ఆంగ్ల వాక్చాతుర్య శిక్షణ మాత్రమే. అమెరికా లేదా పాశ్చాత్య దేశాలకు వెళ్ళవలసిన వారు అప్పటికే యల్‌ కెజి నుండి ఇంజనీరింగు వరకు సుమారు ఇరవై సంవత్సరాలు ఆంగ్ల మాధ్యమంలో చదివినా జి.ఆర్‌.ఇ కి ఆరు మాసాలు శిక్షణ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఉన్నత విద్యలకు మరియు రాష్ట్రం బయట లేదా దేశం బయట ఉద్యోగాలకు పాఠశాలలో ఆంగ్ల మాధ్యమానికి ఎటువంటి సంబంధం ఉన్నట్లు కనిపించదు. ఆంగ్లాన్ని ఒక పాఠ్యాంశంగా నేర్చుకోవడం మాత్రం ఎంతైనా అవసరం. వ్యవహారిక భాషకే కాక ఆంగ్ల సాహిత్యంతో పరిచయం పెంచుకుంటే ఇంకా గొప్ప విషయం.

మన సమస్య తెలుగు భాషను రక్షించే విషయం మాత్రమే కాదు. అంతకన్నా ప్రధానంగా ఇది బాలలకు మాతృభాషలో చదువుకునే హక్కును, కష్టపడి కాకుండా ఇష్టపడి, సంతోషంగా, ఉత్సాహంగా, సృజనాత్మకంగా విద్యా విజ్ఞానాలను పొందే హక్కుకు సంబంధించిన విషయం. ఆంగ్ల మాధ్యమం విద్యార్థిని కుటుంబం నుండి సమాజం నుండి మాత్రమే కాదు తననుండి తనను కూడా పరాయీకరణ చేన్తుంది. ప్రైవేటు పాఠశాలలలో విద్యార్థుల ఆత్మహత్యలు ఈ పరాయీకరణకు పరాకాష్ట కాక మరేమిటి? మాతృభాషా మాధ్యమం గురించి ఇప్పుడు ఏ వాదనా క్రొత్తగా పెట్టవలనిన అవసరం లేదు. కొఠారీ కమీషన్‌ మాతృభాషా మాధ్యమాన్నే సిఫారసు చేసింది. 1968 జాతీయ విద్యావిధానం, 1986 జాతీయ విద్యావిధానం, ప్రస్తుత ముసాయిదా విద్యావిధానం మాతృభాషా మాధ్యమాన్నే సిఫారసు చేసాయి. భారత రాజ్యాంగం అధికరణం 351(ఎ)లో మాతృభాషలో బోధన ప్రభుత్వాల విధి అని విద్యార్థుల హక్కు అని పేర్కొనబడింది. యునెస్కో మాతృభాషా మాధ్యమాన్నే గట్టిగా సిఫారసు చేసింది. మాతృభాషా మాధ్యమాన్ని అమలు చేసిన దేశాలే - విద్యారంగంలో అలాగే ఆర్థిక రంగంలో అభివృద్ధి చెందుతున్నాయని నివేదికలు చెప్తున్నాయి.

ప్రైవేటులో ఆంగ్ల మాధ్యమం ప్రభుత్వ రంగంలో మాతృభాషా మాధ్యమం ఒక వైరుధ్యం, ఇది దీర్ధకాలం కొనసాగడం సాధ్యం కాదు. ప్రభుత్వరంగంలో కూడా ఆంగ్ల మాధ్యమం అమలు కౌరకు రాష్ట్ర ప్రభుత్వం దాడిపూరితంగా వ్యవహరిస్తున్నది. ప్రజాతంత్ర ఉద్యమం రెండు రంగాలలో మాతృభాషా మాధ్యమం కౌరకు పోరాడాలి. మధ్యేయ మార్గం లేని స్థితికి పరిస్థితి చేరుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు అనుసరించిన విధానాలను పరిశీలిద్దాం. పది సంవత్సరాల క్రితం ప్రైవేటు పాఠశాలలో మొత్తం ఆంగ్ల మాధ్యమం ఉండింది మరియు ప్రభుత్వ పాఠశాలలో మొత్తం మాతృభాషా మాధ్యమం ఉండింది. ఆనాడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ముందు రెండు మార్గాలు ఉండినాయి. ప్రైవేటు పాఠశాలలో కూడా మాతృభాషా మాధ్యమాన్ని అమలు చేసి ఒక శాస్త్రీయ విధానానికి

10

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫిబ్రవరి-2020