పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

75


ఉంటే, పత్రికను సంస్కరణకు సంబంధించిన వార్తలతో నింపడంగాని, వెంకటరత్నం రాసిన వ్యాసాలు ప్రచురించడంగాని, వీరేశలింగాన్ని సి.ఎస్.ఐ. బిరుదంతో సత్కరించమని ప్రభుత్వాన్ని అర్ధించడంగాని చేసి ఉండడు.

పీపుల్స్ ఫ్రెండ్ సంపాదకీయాలు

1. టూ పిక్చర్స్ సంపాదకీయం

1876లో సురేంద్రనాథబెనర్జీ “ఇండియన్ అసోసియేషన్” (Indian Association) స్థాపించాడు. విద్యావంతులైన కలకత్తా మధ్యతరగతి ప్రజలకు ఇది ఒక వేదిక అయింది. ఈ సంస్థద్వారా బ్రిటిష్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చట్టాలను ప్రభుత్వ దృష్టికి తీసుకొని వచ్చారు. ప్రజాభిప్రాయాన్ని సమీకరించారు. లార్డ్ రిప్పన్ (Lord Ripon) వైస్రాయిగా ఉన్నకాలంలో 1883లో ఇల్‌బర్ట్ బిల్లు తయారు చేశారు. వైస్రాయి సలహా మండలిలో 'లా మెంబరయిన' (law member) కోర్ని ఇల్బర్ట్ ("Sir Courtney illbert") క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (Criminal Procedure Code) కు సవరణ ప్రతిపాదించాడు. చట్టంముందు అందరూ సమానులే అని చెప్పడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. బ్రిటిష్ పౌరులైన యూరోపియన్లు అంతవరకూ అనుభవిస్తూ వచ్చిన ప్రత్యేక సౌకర్యాలను తొలగించడానికి ఈ బిల్లు ఉద్దేశించబడింది. సివిల్ సర్వీసుల్లో ఉన్న యూరోపియన్ మేజిస్ట్రేట్లకు (European Magistrates) భారతీయులను క్రిమినలు చట్టాల ప్రకారం విచారించే హక్కు ఉన్నట్లే, సివిల్ సర్వీసుల్లో ఉన్న భారతీయ జిల్లా మేజిస్ట్రేట్లకు యూరోపియన్లను విచారించే అధికారం లేదు. ఇల్బర్ట్ బిల్లు చట్టం అయితే వారికి ఈ అధికారం లభిస్తుంది. ఈ చట్టం అమలులోకి వచ్చినా దాని పరిధి ఒక్క బెంగాల్ పరగణాకు మాత్రమే పరిమిత మవుతుంది. ఆ రోజుల్లో ఐ.సి.ఎస్. పరీక్ష పాసై, జిల్లా మేజిస్ట్రేట్లుగా పనిచేస్తున్న కొద్దిమంది భారతీయులు ఆ పరగణాలో మాత్రమే ఉన్నారు. లార్డ్ రిప్పన్ ఇల్‌బర్ట్ బిల్లు ద్వారా న్యాయవ్యవస్థలో ఉన్న అసంబద్ధతను తొలగించడానికి పూనుకొన్నాడు.

బెంగాల్ పరగణాలో టీతోటల యజమానులందరూ యూరోపియన్లు. వారు భారతీయ కూలీలను హీనాతిహీనంగా చూచేవారు. దేశీయులపట్ల జాత్యహంకారంతో ప్రవర్తించి, అనేక రకాల వివక్షలు ప్రదర్శించేవారు. ఆయుధచట్టం ప్రకారం దేశీయులు ఆయుధాలు కలిగి ఉండడం శిక్షార్హమైన నేరం. యూరోపియన్లకు ఈ చట్టం వర్తించదు. యూరోపియన్ టీతోటల యజమానులు, చిన్న పెద్ద వ్యాపారులు, అడ్వకేట్లు, యూరోపియన్ పత్రికా సంపాదకులు, ఇల్‌బర్ట్ బిల్లుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బిల్లు పాసైతే భారతీయ మేజిస్ట్రేట్లు తమ అధికారాలను దుర్వినియోగం చేస్తారు, యూరోపియన్లు ఈ దేశంలో ఉండడం అసాధ్యమౌతుందని పసలేని వాదన లేవదీశారు.