పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

72

దంపూరు నరసయ్య


ఉపన్యసించాడు. ఈ సందర్భంలో ఆయనకు ఇద్దరు బాల వితంతువులకు వివాహం చేసే అవకాశం లభించింది. మద్రాసులో పెళ్ళిళ్ళు జరిపిస్తే తాము హాజరు కావలసివస్తుందని, పెళ్ళిళ్ళు వేరొకచోట జరిపిస్తే పెళ్ళిళ్ళకు వెళ్ళలేదనే అపవాదు తప్పుతుందని, తాము సంస్కరణ పక్షం నుంచి వైదొలగినట్లు తెలిస్తే, ఉద్యమానికి నష్టం వాటిల్లవచ్చని రఘునాథరావు, చెంచలరావు వీరేశలింగానికి నచ్చచెప్పి, పెళ్ళిళ్ళు బళ్ళారిలో జరిగించేటట్లు ఒప్పించారు. ఈ ఏర్పాటులో మన్నవ బుచ్చయ్య, రఘుపతి వెంకటరత్నం వీరేశలింగానికి అండగా ఉన్నారు.50

నరసయ్య పీపుల్స్ ఫ్రెండ్ పత్రిక ప్రారంభించడం, రఘుపతి వెంకటరత్నం కళాశాల విద్యకోసం మద్రాసులో అడుగు పెట్టడం ఒకేసారి జరిగాయి. అప్పుడు రఘుపతి వెంకటరత్నం వయసు ఇరవై సంవత్సరాలు. ఆయన 1881-85 మధ్య ఉన్నతవిద్య అభ్యసిస్తూ మద్రాసులో ఉన్నాడు. 1881లో ఎఫ్.ఏ చదువుతూ, పండిత శివనాథశాస్త్రి ఉపన్యాసాలు విని బ్రహ్మసమాజంవైపు ఆకర్షించబడినట్లు, బ్రహ్మసమాజ కార్యకర్తగా పరివర్తన చెందడంలో మన్నవ బుచ్చయ్య ప్రోత్సాహం ఉన్నట్లు ఆయన ఆత్మకథలో వివరించాడు.51 వెంకటరత్నం కళాశాలవిద్య కొనసాగిస్తూనే బ్రహ్మసమాజ ఆశయాలను ప్రచారంచేశాడు. బ్రహ్మసమాజ భవన నిర్మాణానికి కృషి చేశాడు. సాంఘిక స్వచ్ఛతా ఉద్యమం ప్రారంభించి, ముందుకు తీసుకొని వెళ్ళాడు. వ్యక్తిగత జీవితంలో నిర్మలమైన నడవడిక, మద్యపానానికి దూరంగా ఉండడం, కళావంతుల వ్యవస్థ రద్దుకు కృషిచేయడం ఈ స్వచ్ఛతా ఉద్యమం ప్రధాన ఆశయాలు. ఈ ఉద్యమం బలపడి ప్రెసిడెన్సీలోని ఇతర పట్టణాలకు వ్యాపించింది. వెంకటరత్నం మద్రాసు క్రిస్టియన్ కాలేజీ నుంచి పట్టాపుచ్చుకున్న తర్వాత, “సంవత్సరంపాటు ది పీపుల్స్ ఫ్రెండ్, బ్రహ్మ ప్రకాశిక, దిఫెలో వర్కర్‌లలో” తన పత్రికావ్యాసంగం కొనసాగించాడని ఏభై ఏళ్ళ క్రితమే డాక్టర్ వి.రామకృష్ణారావు రికార్డు చేశాడు.52 వెంకటరత్నం పీపుల్స్ ఫ్రెండ్ సంపాదక వర్గంతో సన్నిహితంగా ఉండి రచనలు చేసినట్లు ఆచార్య వకుళాభరణం రామకృష్ణ పేర్కొన్నాడు.53 నరసయ్య బ్రహ్మసమాజ కార్యకర్త, సంస్కరణోద్యమ కార్యకర్త కాబట్టే వెంకటరత్నం సాంఘిక స్వచ్ఛతా ఉద్యమానికి పీపుల్స్ ఫ్రెండ్‌లో చోటు కల్పించాడు. బ్రహ్మసమాజంతో, సంఘ సంస్కరణ ఉద్యమంతో ఉన్న సంబంధాలే నరసయ్యను, మన్నవ బుచ్చయ్యను, వెంకటరత్నాన్ని కలిపాయి. బ్రహ్మసమాజ సంబంధాలవల్లే నరసయ్యకు బెంగాలులోని మేధావులతో పరిచయాలు ఏర్పడ్డాయి.54 వెంకటరత్నం జర్నలిజం తొలి పాఠాలు నరసయ్య వద్ద నేర్చుకున్నట్లు అనిపిస్తుంది. నరసయ్య, వీరేశలింగం మధ్య జరిగిన 'కరస్పాండెన్సు' తాను చదివినట్లు, వెంకటరత్నం పీపుల్స్ ఫ్రెండ్‌లో పనిచేసినట్లు నరసయ్య మనుమడు కృష్ణమూర్తి చెప్పడం కూడా ఈ అభిప్రాయానికి బలం చేకూరుస్తుంది.