పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

71


సభ్యులలో బ్రాహ్మణులు వివాహానికి వచ్చినా, పెళ్ళిభోజనం చేయడానికి సిద్ధంగా లేనందువల్ల మద్రాసులో ఈ వివాహం చేయడం 'అవివేకచర్య' గా భావిస్తున్నట్లు రఘునాథరావు వీరేశలింగానికి తెలియజేశాడు. వివాహం మదరాసులోనే చేయాలనే పట్టుదలతో పెళ్ళిబృందాన్ని వెంటబెట్టుకొని వీరేశలింగం మద్రాసు వచ్చాడు. అయిష్టంగానే రఘునాథరావు పెళ్ళి ఏర్పాట్లు చేశాడు. మద్రాసులో జరుగుతున్న తొలి పునర్వివాహం గనుక వందమందిపైగా పెళ్ళికి వచ్చారు. వీరిలో మద్రాసు వితంతు పునర్వివాహ సంఘసభ్యులు, విద్యార్థులు ఉన్నారు. వేడుక చూడవచ్చినవారిలో కొద్దిమంది మాత్రమే వధూవరులతో కలిసి పెళ్ళి భోజనం చేశారు. పెళ్ళిభోజనానికి “రఘునాథరావు మొదలైన ప్రముఖులు” రాని సంగతి పత్రికలలో ప్రకటించమని కొందరు యువకులు పట్టుపట్టినా, తానాపని చెయ్యలేదని వీరేశలింగం స్వీయచరిత్రలో పేర్కొన్నాడు.45

ఆనాటి మద్రాసు పత్రికలు ఈ పెళ్ళిముచ్చట్లను గురించి వివరంగా రాశాయి. పెళ్ళి ఆడంబరంగా జరిగినట్లు, పెళ్ళి ఊరేగింపు మైలాపూరు బ్రాహ్మణ వీధి గుండా సాగినట్లు వర్ణించాయి.46

"This stirred the ire of the religious heads who promptly excommunicated six reformers who had participated in a dinner given to the married couple. An attempt to settle the differences amicably at a conference in September 1884 failed, owing to the insistence of the Head Priest of Triplicane to be the sole judge of the discussion" అని సుందరలింగం పేర్కొన్నాడు. ఈ విషయాలను ఆయన మద్రాస్ టైమ్స్ 1883 జూన్ 11, 1884 సెప్టెంబరు 9 సంచికల నుంచి కోట్ చేశాడు.47

“ఈ బహిష్కరణ తర్వాత చెంచలరావు, రఘునాథరావుగారును పెండ్లి భోజనములు చేయకపోయినను, కులమువారైన మాధ్వులు చెన్నపురిలోని ఎనిమిదవ వివాహానంతరము వారిని కొంత బాధింపసాగిరి. వారి యాచార్యుడైన యుత్తరాదిస్వామి చెన్నపురికి వచ్చి కొంత కాలమచ్చట వాసమేర్పరుచుకొనిరి” అని పేర్కొనడమేకాక, రఘునాథరావు, చెంచలరావు ప్రాయశ్చిత్తం చేసుకొన్నసంగతి వీరేశలింగం స్వీయచరిత్రలో పేర్కొన్నాడు.48 వితంతు వివాహాలను ప్రోత్సహించవద్దని పీఠాధిపతి చేసిన ఆదేశాన్ని అంగీకరించి, రఘునాథరావు, చెంచలరావు పీఠాధిపతితో రాజీపడినట్లు ఆనాటి పత్రికల రాతలవల్ల తెలుస్తుంది.49

రఘుపతి వెంకటరత్నం

1885 జనవరి లో వీరేశలింగం మద్రాసులో వితంతు వివాహాల మీద