పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

69


రాశాడు. వీరేశలింగం మద్రాసు రాకవల్ల అక్కడ పునర్వివాహ ఉద్యమం బలపడడమేకాక, ఆయనతో సహపంక్తి భోజనం చేసి, ఆయనను బ్రాహ్మణుడుగా అంగీకరించడం కూడా “మద్రాస్ విడో మ్యారేజ్ అసోసియేషన్” వారి ఆలోచనలో ఉంది.37

సాంఘిక సంస్కారాభిమాన షట్చక్రవర్తులు

ఆ యేడు మే నెలలో తొలి వితంతు వివాహ దంపతులను వెంటబెట్టుకొని సతీసమేతంగా వీరేశలింగం మద్రాసు చేరాడు. మద్రాసులో వీరికి గొప్ప అతిథి మర్యాదలు జరిగాయి. వీరేశలింగం క్రిస్టియన్ కాలేజి ఆండర్సన్ హాలులో, ఇతర సమావేశాల్లో స్త్రీ పునర్వివాహ సమస్య మీద ఉపన్యసించాడు. ఆ రోజుల్లోనే కొక్కొండ వెంకటరత్నం, వేదం వేంకటరాయశాస్త్రి సంస్కరణను వ్యతిరేకిస్తూ ఉపన్యాసాలు చేశారు. తెలుగు బ్రాహ్మణులు వీరేశలింగం పాల్గొన్న సభల్లో సంస్కరణను వ్యతిరేకిస్తూ మాట్లాడేవారు.38

వీరేశలింగం మద్రాసుకు రాకముందే స్త్రీ పునర్వివాహాన్ని బలపరచేవారెవరో తెలుసుకోడానికి చెంచలరావు, రఘునాథరావు సహపంక్తి భోజన వివరాలను పత్రికలలో ప్రకటించారు. ఈ సందర్భంలో 'హిందూ' పత్రికలో రోజూ రెండు మూడు ఉత్తరాలు ప్రచురింపబడుతూ వచ్చాయి. అవి సంస్కరణ వాదులకు ప్రోత్సాహం ఇచ్చేవి కాదని వీరేశలింగం స్వీయచరిత్రలో రాశాడు. 'పేరుగల'వారు ఇరవై ముప్పైమంది ఆహ్వానాన్ని అంగీకరిస్తూ ఉత్తరాలు రాశారు. చివరకు అంత విశాలమైన మద్రాసు మహానగరంలో సహపంక్తి భోజనంలో పాల్గొన్నవారు అయిదుగురు మాత్రమే.39 ఈ సంఘటన గురించి వీరేశలింగం స్వీయచరిత్రలో ఈ విధంగా రాశాడు. “దేశాభిమానులయిన సంస్కార ప్రియులందరకును నిర్ణీత దినమున సంస్కార భోజనమునకు దయచేయ వలసినదని బహు దినములకు ముందుగానే ఆహ్వాన పత్రికలు పంపిరి. వానికి బదులు వ్రాయుటకే కొందరు సంస్కార ప్రియులకు తీరిక కాలేదు. పలువురు కార్యాంతర భారములచేత తాము రాలేక పోయినందుకు విచారములు తెలుపుచూ క్షమాపణలు చేసిరి. సబుజడ్జిగా నుండిన గణపతయ్య గారొక్కరు మాత్రమాహ్వాన మంగీకరించి రాఁగలిగిరి. అప్పుడు... ఆ విందుకు వచ్చినవారు వివాహదంపతులుగాక, రఘునాథరావుగారును, చెంచలరావు పంతులుగారును, గణపతయ్యగారును, దంపూరు నరసయ్యగారును, మన్నవ బుచ్చయ్యపంతులుగారును, నేనును గలసి సాంఘిక సంస్కారాభిమాన షట్చక్రవర్తులు. ఈ యాఱుగురితోను విందు జయప్రదముగా ముగిసిన తర్వాత .......”40

"సబుజడ్జిగా నుండిన గణపతయ్య గారొక్కరు మాత్రమే ఆహ్వానమంగీకరించి రాగలిగిరి” అని వీరేశలింగం రాయడంచేత, సంస్కారభోజనానికి వచ్చిన అతిథి ఆయన ఒక్కరే అని తేలుతుంది. నరసయ్యతో సహా మిగిలిన నలుగురు సంస్కార భోజనం