పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

58

దంపూరు నరసయ్య


పూర్తికాలం వినియోగించవలసిన స్థితికి చేరుకొంటున్న సమయం. దేశీయపత్రికలు అనేక సమస్యలతో సతమతమవుతున్నకాలం. పాఠకులు చందాలు సక్రమంగా చెల్లించకపోవడం, ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు అందకపోవడం, ఇంగ్లీషువారు నడిపే పత్రికలతో పోటీపడవలసి రావడం, దేశీయ వ్యాపార వర్గాలు, స్థానికులు ఈ పత్రికలలో పెట్టుబడులు పెట్టకపోవడం, పత్రికా నిర్వాహకులు పూర్తికాలాన్ని పత్రికకోసం వినియోగించలేకపోవడం వంటి పరిస్థితులు దేశీయపత్రికలు నిలదొక్కుకోలేక పోవడానికి కారణాలుగా చెప్పుకోవచ్చు. ఇందుకు భిన్నంగా యూరోపియన్ యాజమాన్యాలు పత్రికలను సమర్థవంతంగా నిర్వహించేవి. యూరోపియన్లకు పత్రికా నిర్వహణ ఒక వృత్తి, వ్యాపారం. ప్రభుత్వం అండదండలు ఉండనే ఉన్నాయి. ఈ పరిస్థితులలో ఇంగ్లీషు విద్య అభ్యసించినవారిని పత్రికారంగం ఆకర్షించలేకపోయింది. కొందరు విద్యావంతులు పత్రికలు ప్రారంభించి, ఉద్యోగ పర్వంలో పదోన్నతి సాధించడానికి నిచ్చెనమెట్లుగా వాడుకొన్నారు.19 కొంతమంది యువకులు మాత్రం ఉద్యోగాలు, వృత్తులు మానుకొని, దేశభక్తితో, గొప్ప ఆదర్శాలతో పత్రికలు నడపడానికి ఉద్యమించారు. అధ్యాపకులు, వకీళ్ళు, ప్రభుత్వోద్యోగులు పత్రికారంగంలో ప్రవేశించారు.

హిందూ ప్రారంభమైన తర్వాత, 1880 దశాబ్దంలో భారతీయుల యాజమాన్యంలో ఇంగ్లీషు, తమిళం, తెలుగు మొదలైన దేశభాషల్లో పత్రికా ప్రచురణ ఊపందుకుంది. కొన్ని పత్రికలు ఇంగ్లీషు - దేశభాష రెండింటిలో వెలువడుతూ వచ్చాయి. ఇదే సమయంలో మతపరమైన పత్రికలు పుట్టుకొచ్చాయి. జిల్లాలలో దేశభాషలలో పత్రికాప్రచురణ ప్రారంభం అయింది. ఆ కాలంలో జర్నలిజం సామాజిక రాజకీయాంశాలతో ముడిపడి ఉంది. ఇంగ్లీషు విద్య అభ్యసించిన తొలితరం విద్యావంతులు బ్రాహ్మణులు, పై వర్గాలవారు కావడంవల్ల, తొలితరం పత్రికా నిర్వాహకులు కూడా ఆ వర్గాలనుంచి వచ్చారు.20 సరిగ్గా ఇటువంటి పరిస్థితుల్లోనే నరసయ్య మద్రాసులో అడుగుపెట్టాడు. ఆయనలో అణగి ఉన్న కాంక్ష ఊరుకోనివ్వలేదు. నిక్షేపమైన డెప్యూటీ స్కూల్ ఇన్‌స్పెక్టరు ఉద్యోగం విడిచిపెట్టి మద్రాసు దారిపట్టాడు. పీపుల్స్ ఫ్రెండ్ పత్రిక ప్రచురణ, పీపుల్స్ ఫ్రెండ్ ప్రెస్ నిర్వహణ వృత్తిగా స్వీకరించాడు.

పీపుల్స్ ఫ్రెండ్

అచ్చాఫీసు ప్రారంభించడం మాటలు కాదు. 1840 ప్రాంతాలలో ఒక్క తెలుగుభాషలో పత్రిక నిర్వహించడానికి కనీసం రెండువేల రూపాయల పెట్టుబడి అవసరం అయ్యేదని ఒక అంచనా.21 మూడు భాషల్లో అచ్చుపనులు నిర్వహించడానికి, ఇంగ్లీషులో వారపత్రిక నడపడానికి అనువైన ప్రెస్ సమకూర్చుకోడానికి పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం