పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

54

దంపూరు నరసయ్య


Fee) వసూలు చెయ్యాలని, టౌనుకు ఒకవైపు, దూరంగా, జనావాసాలు లేని చోటికి వీరిని తరలించాలని నరసయ్య సూచిస్తాడు. తన మాదిరి ఈ న్యూ సెన్సువల్ల బాధపడుతున్న వారెవరైనా మేజిస్ట్రేటును చర్యతీసుకోమని కోరవచ్చునంటాడు. అవసరం అయితే, న్యాయస్థానంలో సాక్ష్యం చెప్పడనికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలియజేస్తాడు.

మేజిస్ట్రేటుకు రాసిన ఈ ఉత్తరంలో నరసయ్య ప్రజల హక్కులకు సంబంధించిన మౌలికాంశాలను ప్రస్తావిస్తాడు. వ్యక్తికి, సమాజానికి మధ్య వైరుధ్యం ఏర్పడినపుడు వ్యక్తి స్వేచ్ఛ హద్దులను వివరంగా చర్చిస్తాడు. సంప్రదాయ వృత్తులను నిర్వహించుకొనే క్రమంలో సమాజానికి ఇబ్బంది కలిగితే, తీసుకోవలసిన చర్యలను వివరిస్తాడు. బాధ్యతగల అధికారులు జాలి, దయ వంటి హృదయ దౌర్బల్యాలకు లొంగి, చట్టాన్ని అమలు పరచనప్పుడు, ప్రజలకు చట్టంమీద గౌరవం ఉండదని హెచ్చరిస్తాడు. డివిజనల్ మేజిస్ట్రేటు హోదాలో ఉన్న బాధ్యత గల ప్రభుత్వాధికారి నరసయ్య వంటి విద్యాధికునితో ప్రవర్తించిన తీరు ఈ ఉత్తరం రాయడానికి ప్రేరణ ఇచ్చి ఉంటుంది. అనాదిగా ప్రభుత్వాధికారులు చట్టాన్ని గౌరవించే సామాన్య ప్రజల విషయంలో నడుచుకొనే ధోరణికి ఈ వ్యవహారం ఒక మచ్చుతునకగా చెప్పుకోవచ్చు.

ఈ లేఖ ఒక తెలుగువాడు వాతావరణ కాలుష్యం మీద రాసిన మొదటి రచన అని బంగోరె అభిప్రాయపడ్డాడు.31 ప్రజలకు అసౌకర్యం కలిగించే ఇటువంటి విషయాల మీద పత్రికలలో లేఖలు ప్రచురించే సంప్రదాయం ముందునుంచి ఉంది. ప్రజా సమస్యలమీద నరసయ్య స్పందించిన తీరుకు ఈ లేఖ ఒక ఉదాహరణ. పీపుల్స్ ఫ్రెండ్‌లో ఈ ధోరణినే ఆయన కొనసాగించాడు.

విశ్రాంతివేళల్లో, పుస్తకపఠనం నరసయ్య వ్యసనం. వేపనూనె తయారీలో వెలువడే దుర్వాసనతో పాటు, విధి విరామం లేకుండా వేప విత్తనాల దంపకంవల్ల, ఆయన ఏకాంత పఠనానికి భంగం కలిగి ఉంటుంది. ఆయన ఎంత ప్రశాంత వాతావరణాన్ని, ఏకాంతాన్ని కోరుకొంటాడో, దానికి భంగం కలిగితే, ఎంత చిరాకుపడతాడో దినచర్యలోని ఈ వాక్యాలు తెలియచేస్తాయి.

"Dinner cooked and eaten by 12 noon. Reading till 3 p.m. Three troublesome neighbours (women) set up a terrible gossip and made such a frightful noise that I gave up reading in despair. I went away to the temple porch and stayed there reading a little until 6-00 p.m."32