పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

51


పొందలేకపోయి ఉంటాడు.

ఒంగోలు నూనెవర్తకుల "పబ్లిక్ న్యూసెన్సు” మీద రాసిన తర్వాత, పబ్లిక్‌ ఇన్‌స్ట్రక్షన్ డైరెక్టరుతో అభిప్రాయ భేదం ఏర్పడి నరసయ్య ఉద్యోగం మానుకొన్నట్లు ఆయన మనుమడు కృష్ణమూర్తి చెప్పాడు. కానీ ఆ రోజుల్లో ప్రభుత్వోద్యోగాలు చేస్తూ, ఆర్. రఘునాథరావు, కొక్కొండ వెంకటరత్నం, వీరేశలింగం మొదలయినవారు ప్రజాశ్రేయస్సు అభిలషిస్తూ, పత్రికలలో రాశారు. వీరేశలింగం, వకీళ్ళ అక్రమార్జనమిద, న్యాయస్థానాల పనితీరుమీద తీవ్రంగా దాడిచేశాడు. 'పబ్లిక్ న్యూసెన్సు' మీద రాసినంత మాత్రం చేత, పై అధికారుల ఆగ్రహానికి బలై ఉంటాడని నమ్మలేము. కుటుంబ పరిస్థితులు, ఉద్యోగంలో అసంతృప్తి, పత్రిక నడపాలనే బలమైన కాంక్ష ఆయనను నిలవనిచ్చి ఉండవు. ఇటువంటి కారణాలవల్లే ఆయన ప్రభుత్వోద్యోగం మానుకొని ఉంటాడు.

'ఎ నేటివ్ ఆన్ న్యూసెన్సెస్' (A native on nuisances)

'ఎ నేటివ్ ఆన్ న్యూసెన్సెస్' శీర్షికతో నరసయ్య రాసిన ఒక సంపాదకీయ లేఖ మెయిల్ (The Madras Mail) దినపత్రికలో ప్రచురించబడింది. "ఆయన మనుమడు శ్రీ భట్టారం కృష్ణమూర్తిగారు ఈ లేఖకుడికి ఇచ్చిందల్లా 1906లో నరసయ్యగారు తన సొంత అక్షరాలతో రోజువారి వ్రాసుకున్న డైరి, 1875 ప్రాంతంలో మద్రాసు మెయిల్ పత్రికలో పడిన "A native on nuisances" అనే సుదీర్ఘమైన లేఖ” అని బంగోరె వివరించాడుకాని లేఖ ప్రచురించబడిన తారీకు, నెల పేర్కొనలేదు30. మెయిల్ పత్రిక పుటలు ఏమయ్యాయోకానీ, బంగోరె ఆ లేఖను టైపు చేయించి, దానిమీద "Dampuru Narasaiah 1875 Madras Mail" అని సొంతదస్తూరితో రాసి పెట్టిన కాపీ మాత్రం ఈ రచయిత సంపాదించగలిగాడు. నరసయ్య రాసిన లేఖలో అవసరమైన భాగాలను అనువదించి ఇక్కడ ఇవ్వడం జరిగింది.

మెయిల్ పత్రిక సంపాదకులకు,

ఈ లేఖను మెయిల్ పత్రికలో ప్రచురించమని ప్రార్థిస్తున్నాను. ఇందులో అంతా వివరంగా ఉంది. నేను కాపురం ఉంటున్న ప్రదేశానికి సమీపంలో నివసిస్తూ, మేజిస్ట్రేటు (Magistrate) గా పనిచేస్తున్న నా దేశీయ మిత్రుడికి ఈ లేఖను పంపాను. నేనూ దేశీయుణ్ణే. అయినా, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న దేశీయ మేజిస్ట్రేట్లమీద నాకు రవంత కూడా విశ్వాసం లేదు. వ్యక్తిగత స్వార్థంవల్ల, పౌరపాలన విషయంలో వారి అభిప్రాయాలు గందరగోళంగా ఉంటాయి. ఒక కేసులో వారికి ఆసక్తి లేకపోతే, పట్టించుకోరు. చట్టాన్ని పరిశీలించి న్యాయం చెయ్యరు. ఇక్కడి స్థానిక మేజిస్ట్రేటు నా ఉత్తరం అందుకొని కొన్ని వారాల తర్వాత, చర్య తీసుకోడానికి సిద్ధపడ్డాడు. ఆయన