పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

50

దంపూరు నరసయ్య


రాసినవ్యక్తి చేవ్రాలు పోల్చుకొని, తెలుసుకోలేక పోయాను. ఉత్తరం అనువాదం:

19 ఆగస్టు 1875

ప్రియమైన నరసయ్యా,

మీ మొదటి ఉత్తరం చదివి దారుణమైన కుటుంబ విషయాలు తెలుసుకొన్నాను. అవి ఎంతో బాధ కలిగించేవి. రెండుసార్లు మీకు ఉత్తరం రాయాలని ప్రయత్నించి, రాయలేకపోయాను. ఈ పరిస్థితుల్లో మాటలు హాస్యాస్పదంగా ఉంటాయి. మీకు సానుభూతి తెలియ చెయ్యడం తప్ప, నాకు ఏం రాయాలో తోచడం లేదు. ఈ గాయాలను కాలం తప్ప, ఏదీ మాన్చలేదు.

వేన్సు ఏగ్నూవంటి పలుకుబడి కలిగిన వారెవరైనా సహాయపడితేనే తప్ప, రెవెన్యూ బోర్డులో ఉద్యోగం సంపాదించాలనే మీ ప్రయత్నం నెరవేరడం చాలా కష్టం. మీరు కోరుకొనే పదోన్నతి కూడా దేశీయులైన అధికారుల అండలేకపోతే, చిన్న ఉద్యోగంలో చేరి, ఆ హోదాకు చేరుకొనే అవకాశాలు చాలా తక్కువ. మెంబర్లంతా సెక్రెటరీ మీద విడిచిపెడతారు. ఆయన తనను ఆశ్రయించుకొని ఉన్న వారిమీద విడిచి పెడతాడు. ఈ విషయంలో నేనేవిధంగానూ సహాయపడలేను. క్షమించు.

మర్యాదాపూర్వకంగా

భవదీయుడు

(....................)

ఉత్తరంలో నరసయ్య కుటుంబ బాధల ప్రస్తావన ఉంది. బహుశా నరసయ్య పెద్దన్న అకాల మరణాన్ని గురించిన ప్రస్తావనకావచ్చు. అన్న 'పార్ధసారథయ్య' మరణం తర్వాత, తను మద్రాసు వెళ్ళి స్థిరపడాలని యోచించి ఉంటాడు.27 ఈ ఉత్తరంలో రెవెన్యూబోర్డు ఉద్యోగాన్ని గురించి, పదోన్నతిని గురించి, ప్రస్తావించబడింది. ఇంగ్లీషు అధికారుల మెహర్బానీ సంపాదించిన దేశీయ ఉద్యోగుల ప్రాపకం, వేన్సు ఏగ్నూ వంటి గొప్పవారి అండ ఉంటేనే ఆ ఉద్యోగంలో ప్రవేశించడం సాధ్యపడుతుందని ఉత్తరం రాసిన వ్యక్తి తెలియచేశాడు.28 ఆనాటి ప్రభుత్వ పరిపాలన గురించి పరిశోధించిన ఫ్రైకంబర్గ్29 (R.E. Frykenberg), లెనార్డ్, సుందరలింగం మొదలైన పరిశోధకులు ప్రభుత్యోద్యోగాలలో అధికారుల ప్రాపకం గురించి వివరంగా రాశారు. నరసయ్యకు కులపెద్దల అండదండలు లేవు. ఆయన దేశస్థ బ్రాహ్మణుడూ కాదు, తెలుగు నియోగి బ్రాహ్మణుడూ కాదు. తెలుగు ద్రావిడ వైదికి. ఉద్యోగ జీవితంలో పైకి రాలేకపోవడానికి, ప్రాపకం లభించకపోవడానికి ఇది కూడా కారణం కావచ్చు. నిర్మొహమాటంగా, నిజాయితీగా, మాట్లాడే ఆయన వ్యక్తిత్వం వల్ల కూడా ప్రభుత్వోద్యోగంలో ఇమడలేకపోయి ఉంటాడు. పదోన్నతి