పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

46

దంపూరు నరసయ్య


కలెక్టరాఫీసులో అనువాదకుడుగా పనిచేసేవాడని, పత్రిక ఒక సంవత్సరకాలం లోపలే పాఠకుల ఆదరణలేక మూతపడిందని, ఈ పత్రిక నిర్వహణను ప్రత్యక్షంగా చూచినవారిని విచారించి తానీ విషయాలు రాసినట్లు ఆయన పేర్కొన్నాడు. ఇది వారపత్రికో, పక్షపత్రికో ఆయన తెలియజేయలేదు.

"Nellore had the People's Front" అని జె. నటరాజన్ మద్రాసు ప్రెసిడెన్సీ టౌన్‌లలో ప్రారంభమయిన తొలిపత్రికలను గురించి వివరిస్తూ రాశాడు13. ఈ పేరుతో నెల్లూరులో పత్రిక వెలువడినట్లు ఒంగోలు వెంకటరంగయ్య, బంగోరె వంటి స్థానిక చరిత్రకారులెవరూ పేర్కొనలేదు.

నరసయ్య నెల్లూరు కలెక్టరాఫీసులో అనువాదకుడుగా ఉద్యోగంలో చేరిన వార్త "Collector's office - Assumed charge - Dampuru Narasaya, Translator on 4th, January 1871" అని జిల్లాగెజిటులో ప్రచురించబడింది.14 "Dampuru Narasaya, Translator Huzur" అని జూన్ 2వ తేది గెజిటులో నరసయ్య ప్రస్తావన ఉంది. ఉద్యోగంలో పదోన్నతి పొంది “హుజూరు ట్రాన్సులేటరు” అయ్యాడో లేక రెండూ ఒకటేనో స్పష్టంగా తెలియదు15. ఈ ఉద్యోగంలో అయిదునెలలు పనిచేసి, అనారోగ్య కారణంతో జూన్ ఆరంభం నుంచి నవంబరు 13 వరకు సెలవుమీద ఉన్నాడు.16 కలెక్టరాఫీసులో ఉద్యోగం చేస్తున్న కాలంలో నరసయ్య నెల్లూరు మూలాపేటలో నివాసమున్నట్లు, 1872 సంవత్సరం నెల్లూరు సెషన్స్ కోర్టులో జూరరుగా వ్యవహరించడానికి ఎంపిక చేయబడినట్లు గెజిటు ప్రకటనవల్ల తెలుస్తూంది17. 1870-1884 మధ్య వెలువడిన నెల్లూరుజిల్లా గెజిటు సంపుటాలను సమగ్రంగా పరిశీలించాను. అందులో నెల్లూరు పయొనీర్ పత్రిక ప్రస్తావన కనిపించలేదు. “ప్రవక్తక వ్యూహములోని నంబెరుమాళ్ళయ్య సబుమేజిస్ట్రేటు పదవి నందియుండెనట” అని వెంకటరంగయ్య రాశాడు. ఆరోజుల్లో నంబెరుమాళ్ళయ్య రెవెన్యూశాఖలో గుమాస్తా ఉద్యోగం చేస్తున్నట్లు గెజిటులో ఉంది. బహుశా ఉద్యోగ విరమణకు ముందెప్పుడో సబుమేజిస్ట్రేటు అయి ఉంటాడు.

మద్రాసు ప్రెసిడెన్సీ జిల్లాలలో అప్పుడప్పుడే పత్రికా ప్రచురణ మొదలవుతూంది. జిల్లాలో విద్యావ్యాప్తి తక్కువగా ఉండడం, పత్రికాపఠనం కొత్త కావడం, ఇంగ్లీషు పత్రిక కావడం మొదలైన అంశాలు నెల్లూరు పయొనీర్ వైఫల్యానికి దారితీసి ఉంటాయి. విద్యాశాఖలో ఉద్యోగం కావడంవల్ల నరసయ్య నివాసం ఒంగోలుకు మార్చవలసి రావడం, స్థానికుడు కాకపోవడం, అంగబలం, అర్థబలం చాలకపోవడం, వయసులో చాలా చిన్నవాడు కావడం కూడా పత్రిక కొనసాగక పోవడానికి కారణాలు అయి ఉంటాయి. ఈ ప్రయత్నంవల్ల నరసయ్యలోని పత్రిక వెలువరించాలనే తీవ్రమైన ఆరాటం