పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42

దంపూరు నరసయ్య


వెంకటగిరి పిలిపించుకొని ఉంటాడు. పుట్టి పెరిగిన మద్రాసు పట్నాన్ని, తనకెంతో ప్రియమైన బ్రహ్మసమాజ మిత్రులను, సంస్కరణ కార్యక్రమాలను, అన్నిటికన్నా తనకు ఇష్టమైన పత్రికావ్యాసంగాన్ని వదులుకొని వెంకటగిరి వెళ్ళి ఉంటాడు. 1905 అక్టోబరు 27వ తారీకు దినచర్యలో వెంకటగిరి ఉద్యోగం గురించి ఈ విధంగా రాశాడు. "Deepavali day, 36 Years ago this day, I entered the Venkatagiri Rajah's service as tutor to the present Rajah."

ఆ దినాల్లో వెంకటగిరి విద్వత్సంస్థానంగా పేరుపొందింది. సర్వజ్ఞకుమార యాచేంద్ర మేధావిగా, కవి పండిత పోషకుడుగా పేరు పొందాడు. అప్పుడప్పుడే ఆయన దృష్టి మత సాంఘిక విషయాలపైకి మళ్ళింది. ఆయనకు పాశ్చాత్య విజ్ఞానం మీద విశ్వాసం, శాస్త్రీయ దృక్పథం మీద గౌరవం ఉన్నాయి. ఆస్తికుడే, అయినా మతగ్రంథాలను గుడ్డిగా నమ్మడు. 'సేశ్వర' మతాలన్నీ తనకు ఆరాధ్యమైనవే అంటాడు. ' జ్ఞాన సమాజం' పేరుతో వెంకటగిరిలో ఒక సమాజాన్ని స్థాపించి, వారం వారం సామాజిక, విద్యావిషయాల మీద చర్చించేవాడు. మద్రాసు వేద సమాజం వారితో మత విషయాల మీద ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవాడు. విశ్వమత సిద్ధాంతాలను తెలుసుకోడానికి కృషిచేశాడు. రాధాకృష్ణ భక్తితత్త్వాన్ని అభిమానించి, అనుసరించాడు. ఆ రోజుల్లో ఎంతోమంది కవి పండితులు, గాయకులు, విద్వాంసులు వెంకటగిరి సంస్థానానికి వచ్చి సన్మానాలు అందుకొనేవారు.

ఈ కాలంలోనే సర్వజ్ఞకుమార యాచేంద్ర మత సంబంధమైన పుస్తకాలు రాయడానికి పూనుకొన్నాడు. పద్యంలోకన్నా వచనంలో రాస్తే సులభంగా బోధపడుతుందని, వ్యాకరణ పద్దతిలో కాకుండా, వాడుకభాషలో రాస్తే, అందరికీ తెలుస్తుందని అప్పటికే ఆయన అనుభవ పూర్వకంగా గ్రహించాడు.2 ఈ వాతావరణం నరసయ్య వ్యక్తిత్వం మీద ప్రభావం చూపి ఉంటుంది. భాషావిషయాలమీద నరసయ్య అభిప్రాయాలకు ఇక్కడే బీజం పడిఉంటుంది.

నరసయ్య వెంకటగిరి సంస్థాన వాతావరణాన్ని అసహ్యించుకోడానికి బలమైన కారణాలున్నాయి. సర్వజ్ఞకుమార యాచేంద్ర మేధావి, తత్త్వవేత్త అయినా, వేశ్యావ్యామోహం ఆయన బలహీనత. బ్రహ్మసమాజభావాలు, సంఘసంస్కరణోద్యమం నరసయ్య యవ్వనాశలకు ఆకృతి ఇచ్చాయి. మహానగరంలో స్వేచ్చగా పెరిగిన యువకుడికి వెంకటగిరి రాచరిక వ్యవస్థ, నిత్యం వేశ్యల నృత్యగాన వినోదాలతో ముగిసే సమావేశాలు, గోష్ఠులు రోత పుట్టించి ఉంటాయి. ఆ జీవితం అసహ్యంగా, ఇరుకుగా అనిపించి ఉంటుంది.3 సంస్థానం కొలువులో నరసయ్య ఏడాది పాటైనా ఉన్నాడో లేదో! అప్పుడు వెంకటగిరిలో సంస్థానం యాజమాన్యంలో ఒక ఆంగ్లో వర్నాక్యులర్