పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40

దంపూరు నరసయ్య


ఈ ఉత్తరం వల్ల కృష్ణయ్య, ఆయన ఇద్దరు సోదరులు కలిసి పత్రిక ప్రారంభించినట్లు రూఢి అవుతూంది. పత్రిక ప్రారంభించే సమయంలో కృష్ణయ్య పచ్చయ్యప్ప ఉన్నత పాఠశాలలో 'టీచరు' గా పనిచేస్తున్నాడు. పార్థసారథిశాస్త్రి అకౌంటెంట్ జనరల్ ఆఫీసులో 'క్లర్కు' ఉద్యోగంలో ఉన్నాడు. నరసయ్య పచ్చయ్యప్ప ఉన్నత పాఠశాలలో 'అసిస్టెంట్ టీచరు'. 1867 ఆరంభంలోనే నరసయ్య తన తొలి పుస్తకం 'లెటర్స్ ఆన్ హిందూ మేరేజస్' ప్రచురించాడు. ఆ సంవత్సరం ఆఖరులో "హిస్టారికల్ స్కెచెస్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్” పేరుతో తన రెండో పుస్తకాన్ని ప్రచురించాడు.6 అప్పటికే ఆయనకు ఇంగ్లీషు భాషలో మంచి ప్రవేశం ఉంది. పత్రికారచనలో అభినివేశం ఉంది.

ఈ లేఖతో పాటు కృష్ణయ్య నేటివ్ అడ్వొకేట్ సంచికను జత చేసినట్లు తెలిపాడు. దురదృష్టవశాత్తు ఆ పత్రిక కాపీ ఫైల్లో కనిపించలేదు. పత్రికకు గౌరవనీయులైన చందాదారులు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు కూడా తెలిపాడు. "Lately started" అని అనడంవల్ల పత్రిక 1867 ఆగష్టులోనో, అంతకంటే కొంచెం ముందుగానో ప్రారంభమైనట్లు తోస్తుంది. 1869 అక్టోబరు మాసంలోనో, ఆ మరుసటి నెలలోనో నరసయ్య మద్రాసు విడిచిపెట్టాడు. నేటివ్ అడ్వొకేట్ పత్రిక అంతకు కొంచెం ముందుగా ఆగిపోయి ఉండవచ్చని ఊహిస్తున్నాను. ఆర్ధికబలం, పాఠకాదరణ లేక పత్రిక నిలిచిపోయి ఉంటుంది. ఆ కాలంలో దేశీయులు నడిపే పత్రికలకు పాఠకుల ఆదరణ ఉండేదికాదు. 1870లో నరసయ్యకు ఒక ఇంగ్లీషు అధికారి రాసిన జాబులో “No one told me about your insolvency" అనే మాటలు నరసయ్య పత్రిక నడిపి, ఆర్థికంగా చితికిపోయిన విషయాన్ని సూచిస్తున్నాయి. నేటివ్ అడ్వొకేట్ జీవించిన కొద్దికాలం, సామాజిక విషయాలకు, సంస్కరణ భావాలకు అంకితమై ఉంటుంది. నరసయ్య పత్రికా నిర్వహణలో తొలి పాఠాలు ఇక్కడే నేర్చుకొని ఉంటాడు.