పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36

దంపూరు నరసయ్య


బహిష్కరించ వలసింది కదా! రెచ్చిపోయి వాదించుకొంటున్న వారిని ఒక మందలింపు మాటతో సమాధాన పరచవలసిన అవసరం లేదా! అక్కడ సమావేశమైన వారందరూ కళ్ళముందు నడుస్తున్న ఈ వివాదాన్ని చూస్తూ ఉన్నారు. వారిలో నేనూ ఉన్నాను. శ్రీ మన్మహాపీఠాధిపతులను నేనొక్కణ్ణే ఎందుకు తప్పుపట్టాలి?

మీ. ఎన్. వి. డి"

నరసయ్య రాసిన ఈ లేఖలో కొంతభాగాన్ని ప్రచురణార్హంగా లేదని విడిచిపెట్టినట్లు మద్రాస్ టైమ్స్ సంపాదకులు ఒక వివరణ ఇచ్చినట్లుంది. నరసయ్య ఆ వివరణ కూడా తన పుస్తకంలో యధాతథంగా వేసుకొన్నాడు. ఆనాటి పండితవాదాలు సాగిన తీరుకు ఈ సంఘటన ఒక ఉదాహరణ. వీరేశలింగం స్వీయచరిత్రలో ఇటువంటి సంఘటనలను వివరంగా చిత్రించాడు. పీఠాధిపతుల సమక్షంలో తనబావగారికి జరిగిన అగౌరవాన్ని తెలియచెయ్యడానికే నరసయ్య ఈ లేఖ రాశాడు. పదిహేడేళ్ళ నరసయ్య దృష్టికోణం నుంచి ఈ లేఖ రాయబడింది. ఆయనలో దాగిఉన్న పత్రికావిలేకరి, రచయిత అంకురరూపంలో ఇందులో వ్యక్తమయ్యాడు. సభలో పాల్గొన్న వ్యక్తుల, సంభాషణలను ప్రత్యక్ష ఉల్లేఖనంలో రాయడం ఆనాటి పత్రికా రచనా పద్ధతులను సూచిస్తుంది. విద్యావంతుడైన తెలుగువాడు బాల్యవివాహాలపై వెలువరించిన మొదటి పుస్తకం అని పరిశోధకులు ఈ పుస్తకాన్ని ప్రస్తుతించారు.21

ఈ పుస్తకంలోని మూడో లేఖవల్ల, పీఠాధిపతి బాల్య వివాహాలను సమర్థించిన విషయం స్పష్టంగా తెలుస్తుంది. సంప్రదాయ రక్షకుడైన ఈ పీఠాధిపతి పరిశీలనకోసం అనంతరామశాస్త్రి తాను రచించిన వివాహ్య కన్యా స్వరూప నిరూపణాన్ని పంపాడు. ఈ పుస్తకాన్ని పూర్వపక్షం చేస్తూ వెలువడిన గ్రంథాల్లో తన రచన వాద ప్రహసనాన్ని పీఠాధిపతి, సమగ్ర ఖండనగ్రంథంగా ఎంపికచేసి, సన్మానించినట్లు వెంకన్నశాస్త్రి వాద ప్రహసనమ్ ఉపోద్ఘాతంలో పేర్కొన్నాడు. పీఠాధిపతి అనంతరామశాస్త్రి వాదాన్ని తిరస్కరించినట్లు 1865 అక్టోబరు 4, 9 తారీకుల ఎథీనియం అండ్ డెయిలీ న్యూస్ సంచికలు, తదితర పత్రికల వల్ల తెలుస్తూంది.22 ఈ వివాదం తాత్కాలికంగా సద్దుమణిగిందని, బ్రాహ్మణ సంఘంనుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురుకావడంవల్ల రంగనాథశాస్త్రి బాల్యవివాహాలచర్చ అంతటితో ముగించినా, స్త్రీ విద్య మొదలయిన అభ్యుదయకర విషయాలమీద కృషిచేసినట్లు సుందరలింగం పేర్కొన్నాడు.23 సంస్కరణవాదులు బహిష్కరణ భయంతో బాల్యవివాహాల మీద చర్చను ముందుకు తీసుకొనిపోయి ఉండరని లెనార్డ్ అభిప్రాయపడ్డాడు." అనంతరామశాస్త్రి మాత్రం అటు తర్వాత మరింత 'రేడికల్' గా మారినట్లు అనిపిస్తుంది.