పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

25


ప్రస్తావించాడు. ఈ చిన్నచిన్న సంగతులే నరసయ్య వ్యక్తిత్వవికాసంలో పనిచేసిన శక్తులను ఊహించుకోడానికి సహాయపడ్డాయి.

ఆరు లేఖలు

ఈ పుస్తకంలో ఆరు లేఖలున్నాయి. నరసయ్య ఈ ఆరు లేఖలు 1865 జూలై-అక్టోబరు మధ్యకాలంలో రాశాడు. బాల్య వివాహాల మీద రంగనాథశాస్త్రి వర్గానికి, వెంకన్నశాస్త్రికి మధ్య ఏర్పడిన వివాదంలో, వెంకన్నశాస్త్రి అభిప్రాయాలను వివరిస్తూ నరసయ్య ఈ లేఖలు రాశాడు. ఈ లేఖలు రాస్తున్న సమయంలో ఆయనకు పదహారోయేడు పూర్తయి పదిహేడో ఏడు పెట్టింది. ఆయన ఎంత 'మేధావి' అయినా, ఈ లేఖలు రాయడంలో ఎవరో ఒకరి సహకారం, సహాయం ఉండి ఉండాలి. తన బావ వెంకన్నశాస్త్రి 'సిద్దాంత సిద్ధాంజనమ్' లో విపులీకరించిన అభిప్రాయాలను, వాదనలను తాను ఈ లేఖలలో వివరించినట్లు నరసయ్య 'ముందుమాట' లో వినయంగా తెలియచేశాడు. బాల్యవివాహాలకు వ్యతిరేకంగా, రజస్వలానంతర వివాహాలకు అనుకూలంగా మద్రాస్ స్టాండర్డులో ఆయన ప్రచురించిన లేఖ కూడా ఈ పుస్తకంలో ఉంది. ఈ లేఖలో వ్యక్తంచేసిన భావాలు వెంకన్నశాస్తివి కావు. రంగనాథశాస్త్రి వర్గానికి చెందినవి కావు. తాను గాఢంగా విశ్వసించిన అభిప్రాయాలనే నరసయ్య ఇందులో వ్యక్తం చేశాడు. నరసయ్య కన్నా ముందు ఆయన సోదరులిద్దరు ఉదార పాశ్చాత్య విద్యావిధానంలో చదువు సాగించారు. వీరి ప్రభావం నరసయ్యమీద ఉంది. లౌకిక విద్యా విధానం, బ్రహ్మసమాజ భావాలు, పాశ్చాత్య సమాజ విలువలు, క్రైస్తవ మత బోధనలు, అప్పుడప్పుడే ననలువేస్తున్న సంస్కరణవాదుల అభిప్రాయాలు యవ్వనంలో అడుగుపెడుతున్న నరసయ్య మీద చెరగని ముద్రవేశాయి. ఈ నేపథ్యంలోనే ఆయన రాసిన ఈ లేఖలను పరిశీలించవలసి ఉంటుంది. తన పుస్తకానికి ఆయన రాసిన పరిచయ వాక్యాల అనువాదం :

ముందుమాట

ఈ లేఖలు నేనే రాశానని ఎంతో సంకోచంతో ఇప్పుడు ప్రకటిస్తున్నాను. ఈ లేఖలలో ఏదైనా మంచి ఉంటే, అది ఆ లేఖల చివర ఉన్న పేర్లకు చెందుతుంది. ఈ లేఖలలో ఒకే విధంగా వ్యక్తమయ్యే భావాలు, వాదనలు మాబావ గౌరవనీయులు, చతుష్షష్టి కళాత్మక, అలంకార సార్వభౌమ బిరుదాంకితులైన జి. వెంకన్నశాస్త్రి 'సిద్దాంత సిద్ధాంజనమ్' లో ఎంతో సమర్థవంతంగా ప్రకటించినవే. ఆయన భావాలకు ఇంగ్లీషు భాష అనే ముసుగు తొడగడం మాత్రమే నేను చేసినపని అని మనసుకు తెచ్చుకొన్నప్పుడు, ఈ విధంగా ఆ లేఖలను ప్రజల ముందుంచడం ఎంత తొందరపాటు పనో నాకు తెలియకపోలేదు. ప్రజలదగ్గర పొగడ్తలు ఆశించనపుడు, నిజాన్ని వారిముందుంచితే, నేను చేసిన మహాపరాధాన్ని క్షమిస్తారని నాకు తెలుసు. ఒక