పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24

దంపూరు నరసయ్య


వెంకన్నశాస్త్రియర్, సి. ఎన్.ఐ వెర్సెన్ సి. రంగనాథ శాస్త్రియర్ అండ్ సి. అనంతరామశాస్త్రియర్” అని పుస్తకానికి రెండు పేర్లు పెట్టాడు. ఈ పేర్ల కింద “హిందువులలో బాల్యవివాహాలను సమర్థిస్తూ కొంతకాలంక్రింద మద్రాస్ టైమ్స్‌లో ప్రచురించబడిన లేఖలు" అని ఒక వివరణ ప్రచురించాడు.

నరసయ్య పుస్తకాన్ని వెలుగులోకి తెచ్చిన తొలి పరిశోధకుడు బంగోరె. జమీన్‌రైతు పత్రికలో దీన్ని సంగ్రహంగా పరిచయం చేశాడు. ఆర్. సుందరలింగం ఈ పుస్తకాన్ని సంప్రదించాడు. అనంతరామశాస్త్రికి, వెంకన్నశాస్త్రికి జరిగిన వివాదం సందర్భంలో ఎథీనియం అండ్ డెయిలీన్యూస్‌లో, మద్రాస్ టైమ్స్‌లో ప్రచురించబడిన ఉత్తరాలను తన గ్రంథంలో ఉదాహరించాడు.14 లెనార్డ్ ఈ పుస్తకాన్ని పేర్కొనలేదుగాని, రంగనాథశాస్త్రి పేరుతో నరసయ్య రాసిన లేఖను తన థీసిస్‌లో ఉదాహరించాడు. వేదసమాజ ప్రభావంలో రజస్వలానంతర వివాహాలను సమర్ధిస్తూ కొన్ని రచనలు వెలువడ్డాయని, ఆ రచనలలో ప్రతిపాదించబడిన సూత్రీకరణలను శంకరాచార్యులు తిరస్కరించిన విషయం, మద్రాస్ టైమ్స్ వార్తలను ఉదాహరించి రాశాడు.15 ఆచార్య వి. రామకృష్ణ ఈ పుస్తకాన్ని పేర్కొన్నాడు.16

నరసయ్య అన్నలిద్దరికి విద్యార్థి దశలోనే వెంకటరాయులునాయుడు ఏర్పాటుచేసిన సంస్థలతో సంబంధం ఏర్పడి ఉంటుంది. కేశవచంద్రసేన్ మద్రాసులో చేసిన ఉపన్యాసాలు, మద్రాసు వేదసమాజ కార్యక్రమాలు, ప్రార్థన సమావేశాలు ఈ ముగ్గురుసోదరుల వ్యక్తిత్వం మీద ప్రభావం చూపి ఉంటాయి. వెంకటరాయులునాయుడు 'రైసింగ్ సన్' ఆగిపోయినతర్వాత, ఆయన ఆశయాలను నరసయ్యసోదరులు ప్రారంభించిన 'నేటివ్ అడ్వొకేట్' పత్రిక కొనసాగించినట్లు సుందరలింగం అభిప్రాయపడ్డాడు.17

నరసయ్యకు విద్యార్థిదశలోనే లౌకికభావాలున్న వ్యక్తులతో, బ్రహ్మసమాజం అభిమానులతో పరిచయాలు, స్నేహాలు ఏర్పడినట్లు తోస్తుంది. పళ్ళె చెంచలరావు, చుండూరు కోటయ్య సెట్టి, మన్నవ బుచ్చయ్య మొదలైనవారితో ఆత్మీయమైన సంబంధం ఉన్నట్లుతోస్తుంది. రాజగోపాలాచార్యులు మరణించిన తర్వాత మదరాసు బ్రహ్మసమాజ ఉద్యమానికి శ్రీధరనాయుడు నాయకత్వం వహించాడు. మన్నవ బుచ్చయ్య మొదలైన యువకులు ఈయన పర్యవేక్షణలో బ్రహ్మసమాజ అనుయాయులుగా తీరారు. నరసయ్య మీద కూడా ఈయన ప్రభావం పడిఉంటుంది.

జాన్ బ్రూస్ నార్టన్ (John Bruce Norton) అభిప్రాయాలు ఉదారభావాలున్న ఆనాటి మద్రాసు యువకులందరినీ ప్రభావితం చేశాయి. ఆయన మీద వారికి అపారమైన గౌరవం ఉంది.18 నరసయ్యకు ఆయనంటే గొప్ప ఆరాధనాభావం ఉంది. పీపుల్స్ ఫ్రెండ్ సంపాదకీయంలో ఎథీనియం అండ్ డెయిలీ న్యూస్ పత్రిక ప్రకాశకులను, ఆ పత్రికకు కొంతకాలంపాటు సంపాదకత్వం వహించిన నార్టన్‌ను నరసయ్య ఎంతో గౌరవభావంతో