పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22

దంపూరు నరసయ్య


అయితే 1865 ఆగష్టు 3 నాటికే ఈ పుస్తకం అచ్చయి, ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తూంది.9 అనంతరామశాస్త్రి మనుస్మృతిని ప్రమాణంగా గ్రహించి రజస్వలానంతర వివాహాలను సమర్థించాడు. మనుస్మృతికి విరుద్దంగా ఉన్న పరాశర, వైద్యనాథ స్మృతులను, ఇతర శాస్త్రగ్రంథాలను ప్రమాణంగా గ్రహించనవసరం లేదని తీర్మానించాడు. నాలుగు ఆశ్రమాలలో గృహస్థాశ్రమం ఉత్తమమైనది. ఇందులో స్త్రీలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అందువల్ల వివాహానికి యోగ్యమయిన స్త్రీ లక్షణాలు తెలుసుకోవాలి. స్త్రీరూపంలో ఇప్పుడు జరుగుతున్న బాల్యవివాహాలకు, మనుస్మృతి ఇతర శాస్త్రాల ఆమోదం లేదు. కనుక బాలికలు ఈడేరిన తరువాతనే వివాహం చెయ్యాలని తీర్మానించాడు. శాస్త్ర గ్రంథాల ప్రమాణం సంగతి అట్లా ఉంచితే, లౌకికదృష్టితో చూచినా, బాల్యవివాహాలు అన్యాయమైనవని ఆయన భావించాడు. “చంటి పాపల వయసులో జరుగుతున్న వివాహాలు ఈ లోకం నుంచి తొలగిపోవాల” నే ఆకాంక్ష వ్యక్తం చేశాడు. అనంతరామశాస్త్రి తన పుస్తకాన్ని కంచికామకోటి పీఠాధిపతి “శ్రీమన్మహాదేవేంద్ర శ్రీసరస్వతీపాదు” లకు అభిప్రాయాన్ని అర్థిస్తూ పంపుకొన్నట్లు పీఠికలో వివరించాడు.10

గుర్రం వెంకన్నశాస్త్రి (1825-1880 ప్రాంతం)

పీఠాధిపతి, అనంతరామశాస్త్రి పుస్తకాన్ని తిరస్కరించి, బాల్యవివాహాలను సమర్థిస్తూ ఖండనగ్రంథాలు రాయమని పండితులను ప్రోత్సహించినట్లుంది. “విరించి నగర వాస్తవ్యులు, అనారత ధర్మశాస్త్ర పాఠకులు, సముత్తేజిత ప్రజ్ఞులు” శ్రీరామశాస్త్రి అనంతరామశాస్త్రి అభిప్రాయాలను తిరస్కరిస్తూ ఒక పుస్తకంరాసి, పీఠాధిపతులకు దాఖలు చేసుకొన్నాడు. 'సిద్ధాంత సిద్ధాంజనం' పేరుతో గుర్రం వెంకన్నశాస్త్రి ఒక ఖండన గ్రంథం రాశాడు. ఈ పుస్తకానికి 'వాద ప్రహసనమ్' అని మరొక పేరు పెట్టాడు. 11

వెంకన్నశాస్త్రి నెల్లూరువాడు. రామస్వామిశాస్త్రి కుమారుడు. వెంకన్నశాస్త్రి అన్న అప్పన్నశాస్త్రి మదరాసు హైకోర్టులో “హిందూలా పండితులుగా ఉండి హిందూ ధర్మశాస్త్రము పై 'అధారిటి' అనిపించుకున్నాడు.”12 వెంకన్నశాస్త్రి తన ప్రతిభా పాండిత్యాలను, ప్రసిద్ధిని గురించి వాద ప్రహసనంలో చెప్పుకొన్నాడు. ఈయన మంచి హాస్యప్రియుడని, హాస్యరసం ఉట్టిపడే శ్లోకాలు అలవోకగా చెప్పేవాడని, 'వికటకవి' అని ప్రఖ్యాతి చెందాడని, ఈయన వంశీయులు తెలిపారు. ఈయనకు “చతుష్షష్టి కళాత్మక”, “ఆలంకారిక సార్వభౌమ' బిరుదులున్నట్లు నరసయ్య పేర్కొన్నాడు. నరసయ్య వెంకన్నశాస్త్రిని ఆప్యాయంగా “మై డియర్ బ్రదర్ ఇన్ లా” అని చెప్పుకొన్నాడు.13 వెంకన్నశాస్త్రితో తనకున్న బంధుత్వం స్పష్టంగా తెలియడం లేదు.

సిద్ధాంత సిద్ధాంజనమ్ (వాద ప్రహసనమ్)