పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

17


సాంఘికసమస్యల మీద చర్చ లేవదీశాడు. ఆనాటి ఇతర స్థానిక పత్రికలలో కూడా సంఘ సంస్కరణకు సంబంధించిన విషయాల మీద, వివాహాలలో మితవ్యయాన్ని గురించి, వితంతువివాహాలను గురించి, శుభకార్యాలలో కళావంతుల నృత్య, గాన కార్యక్రమాలను ఏర్పాటుచేయడం గురించి చర్చలు కొనసాగుతూ వచ్చాయి.

శ్రీనివాసపిళ్ళె మరణంతో మద్రాసు సంస్కరణవాదులకు పెద్ద నష్టం జరిగింది. వెంకటరాయులునాయుడు హిందూ ప్రోగ్రెసివ్ ఇంప్రూవ్‌మెంట్ సొసైటి నిర్వహణ బాధ్యతను తలకెత్తుకొని, శ్రీనివాసపిళ్ళె ఆలోచనలను, ఆకాంక్షలను ముందుకు తీసుకొని వెళ్ళాడు. దళితవర్గాల శిశువులకు పాఠశాలలు పెట్టడం, అర్హులైన విద్యార్థులకు ఉపకారవేతనం అందించడం, సంస్కరణను ముందుకు తీసుకొని వెళ్ళే 1856 విడో మేరేజి యాక్టు (Widow Marriage Act) వంటి చట్టాల అమలుకు కృషి మొదలైన కార్యక్రమాలు చేపట్టాడు. హిందూ రీడింగ్ రూం, (Hindu Reading Room) హిందూ డిబేటింగ్ సొసైటీ (Hindu Debating Society) లను స్థాపించి, వాటి కార్యక్రమాల ద్వారా మద్రాసులోని యువకులను, విద్యార్థులను ఆకర్షించాడు. ప్రభుత్వ ప్రచురణలన్నీ ఉచితంగా ఈ రీడింగ్ రూంకు అందేవి. మద్రాసు ప్రముఖులు ఈ సమాజ వేదికమీద ఉపన్యసించేవారు. యువకులలో ఉపన్యాసకళ, చర్చానైపుణ్యం అభివృద్ధి కావడానికి తరచుగా చర్చలు, గోష్ఠులు నిర్వహించబడేవి. ఈ కార్యక్రమాలవల్ల యువకుల్లో ప్రశ్నించేగుణం పెంపొందుతుందని వెంకటరాయులునాయుడు విశ్వసించాడు. మితవాద హిందూవర్గాలు ఈ కార్యక్రమాలను అంతగా ప్రోత్సహించలేదు. 1863లో వెంకటరాయులునాయుడు మరణంతో, ఆయన స్థాపించిన సంస్థలు, పత్రిక ఆయనతోనేపోయాయి.

మద్రాసు యూనివర్సిటీ హైస్కూలులో ఫీజులు ఎక్కువగా ఉండడంవల్ల, పై వర్గాల విద్యార్థులకు మాత్రమే అందులో చదివే అవకాశం కలిగింది. పావెల్ (Eyre Burton Powell) ఈ స్కూలు అధిపతి. ఆయన ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దాడు. టి.మాధవరావు, సి.వి. రంగనాథశాస్త్రి మొదలైన విద్యార్థులు యూరోపియన్ అధ్యాపకుల ఆలోచనలతో ప్రభావితులయ్యారు. జీవితంలో అభివృద్ధికి వచ్చి గొప్ప ప్రభుత్వోద్యోగాలు చేశారు. ఆధునిక విద్యావిధానం వారికి కొత్త చూపునిచ్చింది. నిర్జీవమైన సాంస్కృతిక విలువలు, నియంతలైన పాలకుల పరిపాలన హిందువుల వెనుకబాటుతనానికి కారణాలని మాధవరావు భావించాడు. సాంఘిక దురాచారాలను విడిచిపెట్టిననాడే జాతి పురోగమించగలదని ఆయన నమ్మాడు. పశ్చిమదేశాల విలువలను స్వీకరించి, పాశ్చాత్యుల శాస్త్రాలను, సాహిత్యాన్ని అధ్యయనం చెయ్యడంవల్ల భారతీయులు ఉన్నతస్థితికి చేరుకోగలరని గ్రహించాడు. పాశ్చాత్య విద్యను అభ్యసించిన ఆనాటి మేధావులు ఇటువంటి