పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

170

దంపూరు నరసయ్య


సాహితీ ధురీణులచే నింగ్లీషునఁ బ్రవర్తింపఁబడుచుండినది. ఈ ప్రవర్తకులిద్దఱును, కలెక్టరు కచ్చేరి యుద్యోగులైనను నా కాలపు సర్కారు కట్టుదిట్టములు నీ కాలపు చట్టముల సరళి లేనందున వారిద్దఱు నా పత్రిక సాగింపఁజాలిరి. ఈ పత్రికా విజయమేపాటిగా నుండెనో నిర్ణయింపఁ దగు సాధనసంపత్తి లుప్తమయినది. ఆ కాలమునను నెల్లూరు మహాజనులీ యుద్యమమున కపేక్షితమగు నాదరాభిమానములఁ జూపనందున సంవత్సరావధిలో నయ్యది నశించెనని యా పత్రికా వ్యాపారమును, సాక్షాత్తుగా నెఱిగిన మాన్యులొకరు చెప్పిరి. దీని ప్రతి యొకటి యైనను లభింపలేదు.

ప్రవర్తక వ్యూహములోని నంబెరుమాళ్ళయ్య సబుమేజస్ట్రీటు పదవి నందియుండెనట. దంపూరి నరసయ్య యన్ననో ఈయనకు వార్తా ప్రచార ముగ్గుపాలతో నలవడినటులున్నది. నెల్లూరు పయొనీ రుదయించుకాలమున వీరు నెల్లూరు కలెక్టరాఫీసులో ట్రాన్సులేటరుగా నుండిరఁట. వీరు పుట్టి పెరిగినది మద్రాసు. చిన్నతనమున మద్రాసులో నుండగా “నేటివ్ అడ్వొకేటు” (Native Advocate) అను నాంగ్లేయ పత్రికను సాగించుచుండిరి. అద్దాని జాలించి కీర్తిశేషులగు శ్రీ వేంకటగిరి మహారాజా రాజగోపాలకృష్ణ యాచేంద్రుల వారికి ఇంగ్లీషు ఉపాధ్యాయులుగా వెంకటగిరి చేరిరి. అచటఁ గొంతకాలముండిన పిదప నప్పటి కలెక్టరుగారు వీరి విద్యాకుశలతకు మెచ్చి వీరిని కలెక్టరాఫీసులో (ట్రాన్సు లేటరు) ద్విభాషిఁగ జేర్చుకొనిరి. అటనుండి స్కూళ్ళ డిప్యూటీ ఇన్స్‌పెక్టరుగాఁబోయిరి. అదియు అస్థిరమై తిరుగఁ జెన్నపట్నము (జేరి 1881 ప్రాంతములో పీపుల్సు ఫ్రెండ్ అను లోకహితకరమగు ఇంగ్లీషు వారపత్రిక నారంభించి దాదాపు పదియు నేడు వర్షంబులు దానింగీర్తి ప్రదముగా నడిపిరి......

ఆంధ్రభాషా గ్రామవర్తమాని : నెల్లూరఁ బత్రికా ప్రచార ప్రథమాచార్యులగు దంపూరి నరసయ్యగారు 1897-98 ప్రాంతములఁ జెన్నపట్టణము నుండి నెల్లూరికి దిరుగవచ్చి ఇచ్చట స్థావరము కుదిర్చికొని 1900 సంవత్సరమున ఆంధ్రభాషా గ్రామవర్తమానియను నొకచిన్న తెనుఁగు వార్తాపత్రికను ప్రారంభించిరి. ఇది ముఖ్యముగా పల్లెటూళ్ళకును నచ్చటి జనమునకు నుద్దేశింపబడినది. పల్లెటూళ్ళ రైతులనేకురు తమకష్టములనీ పత్రికాముఖమున, దెలుపుచుండిరి. పాఠకాదరము చాలమిని, ప్రవర్తకుని వార్ధక్యము వలనను నియ్యదియు శైశవముననే యంతరించినది. జీవించియుండిన కొలది కాలమును జనోపయోగములగు పలు విషయములిందుఁ జర్చింపఁబడుచుండెను. ఇది ముఖ్యముగా నెల్లూరు తాలూకా కోడూరు గ్రామము కొఱకు పుట్టినది...

ఒంగోలు వెంకటరంగయ్య

(ఆంధ్ర సాహిత్య పరిషద్పత్రిక సంపుటం 10 సంచిక 4 దుర్మతినామ సంవత్సరం, 1922 - పుటలు 238 - 246. ఈ వ్యాసం “నెల్లూరు పత్రికల చరిత్ర" అనే పేరుతో సుబోధిని వారపత్రిక, సంపుటం 2 సంచికలు 18,20 లలో పునర్ముద్రణ అయింది. )