పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

168

దంపూరు నరసయ్య


వార్ధక్యం అంటే ఆయన అభిప్రాయం ఎన్ని ఏళ్ళనోకాని, అప్పటికి నరసయ్య గారి వయస్సు 51. నరసయ్యగారి జన్మదినానికి సంబంధించిన ఆధారం ఆయన డైరీలో కనబడుతుంది చూడండి.

"Saturday 25th September, 1896 - My forty eighth Birthday" దీని ప్రకారం నరసయ్యగారి జన్మదినం 1849 సెప్టెంబరు 25 అవుతుంది. తెలుగు తిథుల ప్రకారం ఆ సంవత్సరం మహర్నవమి నాడు తన పుట్టిన దినం అని ఆయన తన డైరీలో రాసుకున్నారు.

తన జీవిత విశేషాలను నరసయ్యగారే చెప్పుకొన్న దాఖలా మరొకటి ఉంది. అసలు నరసయ్యగారు తన స్వీయచరిత్రను రాసుకున్నారట. అది వెంకటగిరిలో ఆయన వారసుల ఇంట్లో చాలాకాలం భద్రంగా ఉండేదట. కొన్నేళ్ళ క్రితం వర్షాలకు తడిసి అది ఎందుకూ పనికిరాకుండా పోవడంతో ఆ కుటుంబీకులు దాన్ని పారవేశారట. ఆ విధంగా ఒక విలువైన గ్రంథాన్ని కోల్పోయాము. పోతే, 1901లో నెల్లూరు డిస్ట్రిక్టు మున్సిఫ్ కోర్టులో జరిగిన వ్యాజ్యం O.S. No. 488 of 1900 లో నరసయ్య ఇచ్చిన వాజ్మూలంలో తన గురించి ఇట్లా చెప్పుకొన్నాడు.....

ఇదీ నరసయ్యగారిచ్చిన సాక్ష్యం. ఇకపోతే, నరసయ్యకు సంబంధించిన జాబులు రెండున్నాయి. డైరీలలోని విశేషాలు మరికొన్ని ఉన్నాయి. వాటి గురించి పైవారం.

(పెన్నేపల్లి గోపాలకృష్ణ జమీన్‌రైతు 6-7-1979)

దంపూరి నరసయ్య జీవితచరిత్రలో ప్రధానమైన ఘట్టాలను తెలియజేసే రెండు డైరీలు - రెండు జాబులు

నెల్లూరు పత్రికారంగానికి ఆది పురుషుడనదగిన దంపూరి నరసయ్య జీవితానికి సంబంధించిన కొన్ని విశేషాలను గతవారం ముచ్చటించుకున్నాం. ఇక ఆయన ఉద్యోగానికి సంబంధించిన రెండు జాబులు, ఆయన పత్రిక ఆంధ్రభాషా గ్రామవర్తమానిని పేర్కొనే డైరీ ఈ వారం ప్రస్తావిస్తాను. దంపూరి నరసయ్యగారి పేర ఉన్న ఈ రెండు జాబులు రాసిన వారి పేర్లయితే స్పష్టంగా తెలియడం లేదుగానీ ఇద్దరూ నెల్లూరులో పెద్ద అధికారులే అయ్యుండాలి. కాస్త ఓపిగ్గా పరిశోధిస్తే వారు ఎవరైనదీ తేలుతుంది.

మొదటిజాబు 1870 డిసెంబరు 20వ తేదీ నాటిది. నరసయ్యగారు తన దీనస్థితిని గూర్చి ఆ అధికారికి జాబు రాసుకొన్నట్లున్నారు. అప్పట్లో ఆయన వెంకటగిరిలో రాజాగారి కొలువుమాని స్కూల్లో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. అక్కడ నుండి నెల్లూరు కలెక్టరాఫీసులో ట్రాన్సులేటరుగా నియమితుడయ్యాడు. ఆ నియామకానికి సంబంధించిన జాబు ఇది. చదవండి.....

రెండవజాబు. ఇది కూడా నరసయ్యగారి దుర్భర కుటుంబ పరిస్థితులను వెల్లడించేది.