పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

167


వారి విద్యార్హతలకు మెచ్చి కలెక్టరాఫీసులో ద్విభాషిగా (ట్రాన్స్‌లేటరు) చేర్చుకొనిరని, అటు తర్వాత స్కూళ్ళ డిప్యూటీ ఇన్‌స్పెక్టరయ్యారనీ, అది “అస్థిరం కావడం వల్ల” తిరిగి మద్రాసు చేరి 1881 ప్రాంతంలో 'పీపుల్స్ ఫ్రెండ్' (People's Friend) అనే ఇంగ్లీషు వారపత్రిక ప్రారంభించి, దాదాపు 17 ఏళ్ళు కీర్తిప్రదంగా నిర్వహించారని వెంకటరంగయ్యగారు వ్రాశారు. నరసయ్యగారు 1897-98 ప్రాంతాలలో మద్రాసు నుండి నెల్లూరికి తరలివచ్చి, ఇక్కడ 'ఆంధ్రభాషా గ్రామవర్తమాని' అనే పత్రిక స్థాపించారు. పల్లెటూళ్ళలో రైతాంగానికి వారి కష్టసుఖాలు తలపోసుకొనేందుకు ఈ పత్రిక ఉద్దేశించబడి - (ముఖ్యంగా కోడూరు గ్రామం కోసం) పుట్టిన కొన్నాళ్ళకే అంతరించి పోయింది.

ఇవీ దంపూరి నరసయ్యను గూర్చి ఒంగోలు వెంకటరంగయ్య అందచేసిన వివరాలు. పోతే, వాటిని ఆధారం చేసుకొని ఇటీవల మన బంగోరె మరికొంత పరిశోధన చేసి, నరసయ్య జీవిత విశేషాలను కొన్నింటిని జమీన్‌రైతులో ప్రచురించాడు. పత్రికా సంపాదకుడుగానే కాక, ఒక సంఘ సంస్కర్తగా కూడా నరసయ్య ఆనాటి సమాజంలో నిర్వహించిన పాత్రను గూర్చి బంగోరె విశదంగా పరిశోధించి రాశాడు. వెంకటరంగయ్యగారిచ్చిన ఆధారాలను పట్టుకొని బంగోరె మరింత లోతుకుదిగి పరిశోధించి ఉండకపోతే, దంపూరి నరసయ్య ఆ పాత సుబోధిని సంచికల్లోనే సమాధి అయిపోయి ఉండేవాడేమో. అందుకే దంపూరి నరసయ్యను బంగోరె రీ డిస్కవర్ చేశాడని చెప్పవచ్చు.

అయితే, ఇంతకూ దంపూరి నరసయ్యగారి నెల్లూరు పయొనీరే తొలి నెల్లూరు తెలుగు పత్రిక అనడానికి ఆధారాలేమిటన్నది ఎవరూ చెప్పలేదు. ఆ పత్రిక అప్పుడే గాదుగదా వెంకటరంగయ్యగారు ఆ వ్యాసం రాసే నాటికి గూడా దాన్ని చూచినవాళ్ళు, ఎరిగినవాళ్ళు ఎవరూ లేరు. మరి దానికి సంబంధించిన వివరాలు ఎక్కణ్ణుంచి సేకరించారు? వాటికాధారాలేమిటి? తెలియదు.

సరే అది అటుంచండి. ఇంతకూ ఇప్పుడు చెప్పదలచుకున్నది అదికాదు. నరసయ్యగారి జీవితానికి సంబంధించిన మరికొన్ని విశేషాలు - వెంకటరంగయ్యగారు, బంగోరె చెప్పనివి ఇటీవల నాకు లభ్యమయ్యాయి. ప్రముఖుల జీవితానికి సంబంధించిన ప్రతి చిన్న విషయానికి చారిత్రక ప్రాధాన్యం ఉంటుంది కదా ! ఆ దృష్టితో నెల్లూరు పత్రికల పుట్టుపూర్వోత్తరాలను కూలంకషంగా పరిశోధించబోయేవారికి ఉపకరిస్తుందేమో అనే ఉద్దేశంతో స్వల్పమైనవైనా ఆ విశేషాలను అందజేస్తున్నాను. నరసయ్య జీవితంలో ఇవి ముఖ్యమైన అంశాలు కాకపోవచ్చు. అయినా వీటి ఆవశ్యకత చరిత్రకు యెంతైనా ఉంది. ముఖ్యంగా నరసయ్యగారి జీవిత చరిత్రను పరిశోధించడం అవసరం. ఆ పరిశోధనకు ఈ వివరాలు సహకరించవచ్చు.

నరసయ్యగారి జన్మదినం ఏదో ఎవరూ చెప్పినట్లు లేదు. ఆంధ్రభాషా గ్రామవర్తమాని వెలువరించేనాటికి నరసయ్యగారు 'వార్ధక్యంలో' ఉన్నారని వెంకటరంగయ్యగారు రాశారు.