పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

7

ఉత్తరం కనుగొన్నాను. అక్కడే నరసయ్య నడిపిన ఆంధ్రభాషా గ్రామవర్తమానిలో ప్రచురించబడ్డ వార్తలకు, వ్యాసాలకు ఇంగ్లీషు అనువాదాలను నేటివ్ న్యూస్ పేపరు రిపోర్టు నుంచి వెదికి పట్టుకోగలిగాను. ఈ సమాచారాన్ని విశ్లేషించి, నరసయ్య మిద శ్రీశైలం చరిత్ర సభలలో ఒక పరిశోధనాపత్రం సమర్పించాను. అప్పుడు నాకు నరసయ్య మీద చిన్న పుస్తకం రాయడానికి అవసరమైన సమాచారం ఉందని తట్టింది. ఇందుకోసం నరసయ్య తాలూకు బంధువుల ఆచూకి తెలుసుకోడానికి ప్రయత్నించాను. మద్రాసు, వెంకటగిరి, నెల్లూరు, కోడూరు మొదలైన ఊళ్ళు తిరిగి, నరసయ్య తర్వాత తరాలవారిని, బంధువులను, పరిచయస్తులను కలిసి మౌఖికచరిత్ర సేకరించాను. 1989-90 సంవత్సరంలో ఎంతమందినో కలుసుకొని విచారించాను. నరసయ్య ముగ్గురు మనుమలలో పెద్దవాడు ఆదిశేషయ్య ఉద్యోగవిరమణ చేసిన తర్వాత చనిపోయాడు. ఆయన భార్య కమలమ్మ తనకు తెలిసిన సంగతులు స్పష్టంగా చెప్పింది. నరసయ్య రెండవ మనుమడు కృష్ణమూర్తి, మూడవ మనుమడు రామచంద్రయ్య, కృష్ణమూర్తి కుమార్తె భారతి చాలా విషయాలు చెప్పారు. నరసయ్య అన్న (పార్ధసారధిశాస్త్రి) మనుమరాలు మద్రాసులో ఉందని తెలుసుకొని ఆమెను విచారించాను.

బంగోరె చనిపోయిన తర్వాత, ఆయన సేకరించిన పుస్తకాలు, రాసి పెట్టుకొన్న నోట్సులు ఆయన శ్రీమతి సుమిత్ర కొంతమంది సాహితీపరులకు ఇచ్చింది. బంగోరె నరసయ్య మీద రాసిపెట్టుకున్న నోట్సు లభిస్తుందేమో అని ప్రయత్నించాను. చివరకు బంగోరె దూరపుచుట్టం వేమూరు రవీంద్రరెడ్డి పరిచయం అయింది. ఆయనకు చరిత్ర అంటే శ్రద్ద, అభిమానం ఉంది. సుమిత్ర వద్ద మిగిలిన పుస్తకాలు, నోట్సులు సేకరించి జాగ్రత్త చేశాడు. నరసయ్య రచించిన లెటర్స్ ఆన్ హిందూ మేరేజస్ పుస్తకం, 1906 దినచర్య, పీపుల్స్ ఫ్రెండ్ పత్రిక ఫోటోలు, కొన్ని ఉత్తరాలు, నరసయ్య మెయిల్ పత్రికకు రాసిన లేఖ ఇచ్చాడు. రవీంద్రరెడ్డి బంగోరె ఉత్తర ప్రత్యుత్తరాలను కూడా సేకరించి పెట్టాడు. బంగోరె నార్లకు రాసిన ఉత్తరాల్లో నరసయ్య ప్రస్తావన ఉన్న ఉత్తరాలను ఇచ్చి సహకరించాడు.

బంగోరె నార్లకు రాసిన ఉత్తరంలో “ఈ రోజు అనుకోకుండా మద్రాసు ఆర్కైవ్స్లో ప్రవేశానికి పర్మిషన్ లభించింది. ఎన్నాళ్ళ నుంచో నేను తపిస్తూ వచ్చిన మా నెల్లూరు జర్నలిజం జనకుడు దంపూరు నరసయ్య edit చేసిన People's Friend పత్రిక సంచికలు రెండింటిని కళ్ళారా చూసే భాగ్యం లభించింది. వాటిలో కొన్ని ముఖ్య Editorial items చదివిన మీదట దంపూరు నరసయ్య నిస్సందేహంగా గొప్ప జర్నలిస్టు అనే అభిప్రాయం సాక్ష్యాధారాలతో సహా నేడు మరింత ధృవపడిందే తప్ప అది తగ్గలేదు..” అని అభిప్రాయం వ్యక్తం చేశాడు.24 రెండు నెలల తర్వాత మళ్ళీ నార్లకు ఉత్తరం రాస్తూ “దంపూరు నరసయ్య (నెల్లూరు జర్నలిజం జనకుడు) - ఆయన edit చేసిన 'People's