పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

దంపూరు నరసయ్య

వద్ద ఉన్న నరసయ్య పుస్తకాలను చూడడానికి గోపాలకృష్ణ వెంట ఈ రచయిత కూడా వెళ్ళాడు. కరణకమ్మవీధిలో ఒక ఇంటి పంచలో ఉన్న పాత భోషాణం పెట్టెలో వందలకొద్ది పుస్తకాలు పేర్చి ఉన్నాయి. పుస్తకాలన్నీ 1900 ముందు ప్రచురించబడినవే. ప్రతి పుస్తకం మీద “పీపుల్స్ ఫ్రెండ్ లైబ్రరీ” అని రాసి ఉంది. పుస్తకాలన్నీ కేటలాగు చెయ్యబడ్డాయి. ప్రతి పుస్తకం మిద నరసయ్య చేవ్రాలు ఉంది. దాదాపు అన్నీ ఇంగ్లీషు పుస్తకాలే. సాహిత్యం, చరిత్ర, రాజకీయశాస్త్రం, మతం, జీవితచరిత్రలు, బైబిలు కాపీలు, నిఘంటువులు ఇట్లా ఎన్నో విషయాలమీద పుస్తకాలున్నాయి. గోపాలకృష్ణ తను సేకరించిన ఆధారాలతో జమీన్ రైతులో రెండు వ్యాసాలు రాశాడు.22 నరసయ్య దినచర్య సహాయంతో ఆయన జన్మదినాన్ని నిర్దుష్టంగా నిరూపించగలిగాడు. పీపుల్స్ ఫ్రెండ్ ఎంతకాలం వెలువడింది చెప్పగలిగాడు. ఇది పాతికేళ్ళనాటి సంగతి.

నేను 1972 నుంచి మిత్రులు పెన్నేపల్లి గోపాలకృష్ణను కలుసుకోడానికి తరచుగా జమీన్ రైతు ఆఫీసుకు వెళ్ళేవాణ్ణి. ఆయన ప్రోత్సాహంతో ఆ పత్రికలో అప్పుడప్పుడు ఏదో ఒక వ్యాసం రాస్తూ ఉండేవాణ్ణి. ఆయన సేకరించిపెట్టిన, నరసయ్యకు సంబంధించిన కాగితాలు సంవత్సరాల తరబడి అక్కడే టేబులుమిద దుమ్ముపట్టి పడిఉన్నా, అవి ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలం నాలో ఎన్నడూ కలగలేదు. 1989 జనవరిలో తెలుగు విశ్వవిద్యాలయం ఆతిథ్యంలో శ్రీశైలంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రసభలు జరిగాయి. ఆ సభల్లో నరసయ్య మీద ఒక పరిశోధన పత్రం చదవమని, గోపాలకృష్ణ తన వద్ద ఉన్న రికార్డంతా ఇచ్చి నన్ను ప్రోత్సహించాడు. అప్పటికే ఆ రికార్డులో కొంతభాగం పోయింది.

నరసయ్య మీద రాసిన వారెవరూ ఆయన నడిపిన పత్రికలు చూడలేదు. నా మిత్రుడు ఎం. మునిరత్నం ద్వారా మద్రాసు తమిళనాడు ఆర్కైవ్స్ (Tamil Nadu Archives) లో పీపుల్స్ ఫ్రెండ్ రెండు సంచికలు భద్రపరచబడి ఉన్నాయని తెలుసుకొని, అక్కడ వాటి కోసం అన్వేషించాను.23 మునిరత్నం ఇచ్చిన భోగట్టా ప్రకారం ఆ జి.ఓ నంబర్లు కలిగిన ఫైళ్ళు, ఆ జి.ఓలకు అనుబంధంగా జతచేయబడిన పీపుల్స్ ఫ్రెండ్ సంచికలు కన్పించలేదు. అవి ఏమయ్యాయో, ఎక్కడ మిస్ ప్లేస్ అయ్యాయో ఎవరూ సంతృప్తికరంగా సమాధానం ఇవ్వలేకపోయారు. నా ఉత్సాహం అంతా చల్లబడిపోయింది. అయినా ఓపికగా, పట్టుదలతో ఆర్కైవ్స్లో నా అన్వేషణ కొనసాగించాను. చివరకు పబ్లిక్ జి.ఓ నంబరు 2402 ఫైల్లో పీపుల్స్ ఫ్రెండ్ సంచిక ఒకటి కనిపించింది. పుటలు విప్పి చదవడానికి ప్రయత్నిస్తే, పేజీలు పెళ పెళమని విరిగి ముక్కలు కావడంతో నా ప్రయత్నం విరమించుకొన్నాను. నూట అయిదు సంవత్సరాలనాటి పత్రికను నాలుగు రోజుల వ్యవధిలో, ఆర్కైవ్స్ ఉద్యోగులు చదవడానికి అనువుగా 'మెండ్' చేసి ఇచ్చారు. ఆర్కైవ్స్లో నా పరిశోధనలో పీపుల్స్ ఫ్రెండ్ సంపాదకుడు, పత్రికాధిపతిగా నరసయ్య ప్రభుత్వానికి రాసిన కొన్ని ఉత్తరాలు, 'నేటివ్ అడ్వొకేట్' పత్రిక ప్రారంభించినపుడు సంపాదకులు ప్రభుత్వానికి పంపుకొన్న