పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

141


పత్రికలు ఒకటి రెండు సంచికలైనా, ఏ విదేశీ గ్రంథాలయంలోనో, ఆర్కైవ్స్‌లోనో కనిపించినా ఆశ్చర్యపడ నక్కర లేదు. 19వ శతాబ్దిలో ఒక పత్రిక ప్రచురించిన వ్యాసాన్ని, వార్తను, మరొక పత్రిక పునర్ముద్రణ చేసుకొనే సంప్రదాయం ఉంది. ఇంగ్లీషు పత్రికలలో వెలువడిన వార్తలను, రచనలను దేశభాషా పత్రికల్లో అనువదించి ప్రచురించుకొనే సంప్రదాయమూ ఉంది. పీపుల్స్ ఫ్రెండ్ ప్రచురించిన రెండువార్తా ఖండికలు ఆ విధంగా లభించాయి. ఓపికగా అన్వేషిస్తే పీపుల్స్ ఫ్రెండ్లో అచ్చయిన విషయాలు ఇతర సమకాలిక పత్రికల్లో కనిపించే అవకాశం ఉంది.

హిందూకు సమాంతరంగా పీపుల్స్ ఫ్రెండ్ నడిచింది. 1909 వరకు హిందూ సంపుటాలు పరిశీలిస్తే, పీపుల్స్ ఫ్రెండ్ ప్రస్తావనలు కనుదగిలే అవకాశం ఉంది. హిందూ రజతోత్సవ, స్వర్ణోత్సవ, వజ్రోత్సవ సంచికలు సంప్రదించడానికి ఈ రచయితకు అవకాశం లభించలేదు. వీటిలోనూ పీపుల్స్ ఫ్రెండ్ రెఫరెన్సులు ఉండవచ్చని అనిపిస్తుంది. ఆంధ్రప్రకాశిక, “ఇండియన్ సోషల్ రిఫార్మర్” మొదలైన పత్రికల్లో నరసయ్య పత్రికల ప్రస్తావనలు ఉండే అవకాశం ఉంది.

మద్రాసు మహాజనసభ కార్యక్రమాల్లో నరసయ్య క్రియాశీలంగా పాల్గొని ఉంటాడని అనిపిస్తుంది. ఆ రికార్డులు పరిశీలిస్తే నరసయ్య పాత్ర ఏమైనా ఉందా అనే సంగతి తెలుస్తుంది.

“లెటర్స్ ఆన్ హిందూ మేరేజస్” తప్ప, నరసయ్య రాసిన పుస్తకాలేవీ లభించలేదు. తమిళనాడు ఆర్కైవ్స్‌లో ఓపికగా అన్వేషిస్తే, నరసయ్యకు, ప్రభుత్వానికి మధ్య నడిచిన 'కరస్పాండెన్సు' మరికొంత బయటపడే అవకాశం ఉంది. నెల్లూరు కలెక్టరాఫీసు రీటైన్డ్ డిస్పోజల్సు (Retained disposals) పరిశీలిస్తే, నరసయ్య పంపిన మహజర్లు, అర్జీలు లభ్యం కావచ్చు.

నరసయ్య ఫోటో కూడా ఆయన వారసులవద్ద లేదు.24 “ఆచార్య రంగాగారన్నట్లు దంపూరు నరసయ్యగారు ఎంతటి అద్భుతమైన వ్యక్తి” అనే వాక్యంతో బంగోరె “నూరేళ్ళనాటి జర్నలిస్టు" వ్యాసం ప్రారంభించాడు.25 ఆచార్య రంగా ఏ సందర్భంలో ఈ మాటలు రాశాడో, అన్నాడో బంగోరె ఆ వ్యాసంలో స్పష్టం చెయ్యలేదు. ఆచార్య రంగా నరసయ్య మీద రాశాడా అని శోధించవలసి ఉంది. నా కృషి సమగ్రంగా లేదనే అసంతృప్తితో ఈ రచన ముగిస్తున్నాను.