పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

140

దంపూరు నరసయ్య


పేర్కొన్నా, రెండు మూడుసార్లు అస్వస్థతకు గురిఅయిన విషయం దినచర్యలో ఉంది. 1908లో నెల్లూరులో జరిగిన తొలి జిల్లా రాజకీయ సభలకు కూడా ఆయన హాజరు కాలేదు. 1907-1909 మధ్య ఆయనకు సంబంధించిన సమాచారం ఏదీ లభించలేదు.

గురజాడ 1909 జూలై 7వ తేదీ ఒంగోలు మునిసుబ్రహ్మణ్యానికి రాసిన లేఖలో నరసయ్యను గురించి వాకబు చేస్తూ “ఆయన జీవించి ఉన్నారా?" అని విచారించాడు. నరసయ్య చివరిరోజులు ఎంత అజ్ఞాతంగా గడిచిపోయాయో దీనివల్ల అర్థమవుతుంది. గురజాడ ఉత్తరం రాసే సమయానికి నరసయ్య చనిపోయి తొమ్మిది దినాలు. నరసయ్య కుమారుడు రామకృష్ణయ్య తండ్రి మరణాన్ని “28-6-1909 (ఆషాఢ శు11-)” అని “ఫేమిలీ రిజిస్టరు” లో రాసిపెట్టాడు. వెంకటగిరి పంచాయితీ ఆఫీసు జనన మరణ రిజిస్టరులో ఇదే తారీకు నమోదయింది. “ఆకస్మిక మరణం” అని మరణ కారణాన్ని రికార్డు చేశారు.

నరసయ్యకు ఉదయం పదిగంటలకే భోజనంచేసే మద్రాసు అలవాటట. పొద్దున భోజనం ముగించి, వాలుకుర్చీలో పడుకొని, విశ్రాంతిగా పత్రిక చదువుతూ, అనాయాసంగా ప్రాణాలు విడిచినట్లు తెలుస్తూంది.

నరసయ్య జీవితం అంతా పోరాటమే. ఉద్యోగాలకోసం ప్రయత్నాలు, ఆస్తిపాస్తుల తగాదాలు, బంధువులతో సంబంధాలు - ఇవన్నీ ఆయన కాలాన్ని కొంతవరకు హరించి, సాంఘిక కార్యకలాపాలకు అవరోధాలయ్యాయి. ఇన్ని ప్రతికూల శక్తులమధ్య నూతన భారత నిర్మాణానికి కృషిచేశాడు. ఆయన లక్ష్యం - అజ్ఞానం, అవిద్య తొలగిపోయి కొత్త ప్రపంచం ఏర్పడడం. ఉన్నతమైన, న్యాయమైన సమాజంకోసం తన కాలాన్ని, శక్తిని వినియోగించాడు. ఆయనను ఒక సంఘసంస్కర్తగా గుర్తించవచ్చా? రాజకీయ ఉద్యమాలకు దన్నుగా పత్రికలు నిర్వహించాడా? పొట్టకూటికి పత్రికలు నడిపాడా? దేశభక్తుడా? ఆయనను ఏమని పిలవాలి? సంస్కరణ ఉద్యమంలో వీరేశలింగం, వెంకటరత్నం వంటి నాయకుల పేర్లు లోకానికి తెలుసు. లోకం దృష్టికి రాని "Unsung Heros" ఎందరో? శ్రీధరనాయుడు, సి. సుబ్బరాయలు పెట్టి, మన్నవ బుచ్చయ్య, నరసయ్య, దేశిరాజు బాపయ్య, బసవరాజు, గవర్రాజు ఇట్లా ఎంతెంతమంది అజ్ఞాత వీరులకృషి ఈ మహోద్యమాల వెనక దాగుంది!

శేష ప్రశ్నలు

నా కృషి చాలా అసమగ్రమైనదని తెలుసు. నాకున్న పరిమితులు తెలిసే ఈ పుస్తక రచనకు పూనుకొన్నాను. పీపుల్స్ ఫ్రెండ్ రెండు సంచికలు తప్ప నరసయ్య పత్రిక లేవీ ఇప్పుడు లభించడం లేదు. ఆనాటి పత్రికల పేర్లు వినడమేకాని ఒకటి కనిపించదు. సజీవపత్రిక హిందూ మొదటి మూడేళ్ళ సంపుటాలే ఇప్పుడు లభించడం లేదు. నరసయ్య