పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

5

ఇంగ్లీషు లేఖలను రెండో పర్యాయం సెట్టి ఈశ్వరరావుచేత తెలుగులోకి అనువదింపచేసి “గురజాడ జాబులు” పేరుతో ప్రచురించింది.16

“వొక తెలుగు పుస్తకాన్ని ఎలా రెవ్యూ చెయ్యాలో తెలిసున్న వ్యక్తి నా ఎరికలో ఎవడూ లేడు. అన్నట్టు శ్రీ డి. నరసయ్య అనే పండితుడు వొకాయన “పీపుల్స్ ఫ్రెండ్” అనే వొక వారపత్రికను నడుపుతూ ఉండేవాడు. ఆ పత్రిక ఇప్పుడు వెలువడడం లేదు; ఆయన నెల్లూరు వాస్తవ్యుడు. ఇప్పుడు వున్నారూ? వుంటే ఆయన చిరునామా నాకు పంపించు. ఆంగ్ల భాషలో ఆయన గట్టివాడు. వొకసారి ఆయన్ని కలుసుకో” అని సూర్యారావు అనువాదంలో ఉన్న ఈ భాగాన్ని ఈశ్వరరావు అనువదించకుండా విడిచిపెట్టాడు.

మూలంలో కొంతభాగాన్ని ఏ కారణం చేతయినా అనువాదకుడు అనువదించకుండా విడిచి పెట్టినపుడు ఆ సంగతి పాదసూచికలో సూచించాలి. ఈ సంప్రదాయాన్ని ఈశ్వరరావు పాటించలేదు. మహాకవి గురజాడ రాసిన వాక్యాలను అనాలోచితంగా తొలగించి, నరసయ్య కీర్తిమూర్తికి గ్రహణం పట్టించాడు. గురజాడ ఇంగ్లీషు లేఖ మాతృక ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కైవ్స్, హైదరాబాదు ఆఫీసులో భద్రపరచబడి ఉంది. గురజాడ రాసిన వాక్యాలు ఇట్లా ఉన్నాయి.

"There was a scholar by name D.V. Narasaiah who used to edit a bright English weekly "The People's Friend". now defunct. He was a native of Nellore. Is he living - If so give me his address. He had a wonderful command on English. Please see him".17

విశాలాంధ్ర ప్రచురణ సంస్థ “ఆంధ్రప్రదేశ్ దర్శిని” పేరుతో ఒక రెఫరెన్సు గ్రంథాన్ని ప్రచురించింది.18 రఘుపతి వెంకటరత్నం సంపాదకత్వంలో పీపుల్స్ ఫ్రెండ్ పత్రిక వెలువడినట్లు ఈ గ్రంథంలో పేర్కొనబడింది. ఆ సంస్థ దృష్టిలో ఇది చిన్న పొరపాటు కావచ్చేమో కానీ, నరసయ్య విషయంలో పెద్ద అన్యాయమనే చెప్పాలి.

బంగోరె (బండి గోపాలరెడ్డి), ఒంగోలు వెంకటరంగయ్య వ్యాసం స్ఫూర్తితో, నెల్లూరు మండల పత్రికల చరిత్ర పరిశోధించి ఒక వ్యాసం రాశాడు. 19 ఈ రోజుల్లోనే నెల్లూరు వారపత్రిక "యూత్ కాంగ్రెస్” లో “నెల్లూరు మొదటి జర్నలిస్టు దంపూరు నరసయ్య” శీర్షికతో ఇంకో వ్యాసం వెలువడింది.20 నరసయ్య నెల్లూరు జర్నలిజానికి ఆద్యుడని గ్రహించి ఆయన జీవితవిశేషాలు సేకరించడానికి బంగోరె కృషి చేశాడు. వెంకటగిరి వెళ్ళి నరసయ్య పుస్తకాలు పరిశీలించి వచ్చాడు. నరసయ్య మనుమలను కలుసుకొని, ఉత్తరాలు, దినచర్యలు, ఇతర రికార్డు సేకరించాడు. ఈ ఆధారాలతో జమీన్ రైతులో మూడు వ్యాసాలు రాశాడు.21

బంగోరె శ్రీకారంచుట్టిన ఈ పరిశోధన పెన్నేపల్లి గోపాలకృష్ణ కొనసాగించాడు. నరసయ్య వారసుల వద్ద మిగిలిన రికార్డు సేకరించాడు. వెంకటగిరిలో భాస్కర రాఘవన్