పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

129


ప్రతాపరుద్రీయం మీద రాసిన సమీక్షను సూర్యాలోకంలో పునర్ముద్రణ అయ్యేట్లు చూడమని వేంకటరాయశాస్త్రిని కోరుతూ "..... అది సూర్యాలోకమువారికి వచ్చియున్నది. దానిని సూర్యాలోకములో మరల ముద్రింపవలయునని వారితో చెప్పవలయును....” అని పూండ్ల రామకృష్ణయ్య జాబు రాశాడు.71 సూర్యాలోకం రెండేళ్ళు పూర్తిచేసుకొనేప్పటికి, ఆ పత్రిక యాజమాన్యానికి, వేదంవర్గానికి బెడిసింది. వేంకటరాయశాస్త్రి శాకుంతలానువాదం మీద విమర్శవ్యాసాలు ఆ పత్రికలో వచ్చాయి. వాటికి సమాధానాలు రాసి కాచుకోవలసిన అగత్యం వేదం వర్గానికి కలిగింది. అందుకు ఒక పత్రిక అవసరమైంది. వేంకటరాయశాస్త్రి శిష్యుడు గునుపాటి ఏనాదిరెడ్డి ఆయనకు రాసిన ఒక ఉత్తరంలో “సూర్యాలోకము సమాధానము ప్రకటించదు గాబట్టి, గ్రామవర్తమానిలో విషయము ప్రకటించుటకు నిశ్చయించుకొని యున్నాడను” అని తెలియజేశాడు.72

1901 మే 16 సూర్యాలోకం సంచికలో “విమర్శకులకు సలహా” అనే శీర్షికతో నెల్లూరు నుంచి నాయనశాస్త్రి ఒక సుదీర్చలేఖ రాశాడు. అందులో ఆంధ్రభాషా గ్రామవర్తమాని ప్రస్తావన ఉంది. “నా పత్రికలో వ్రాయబడుతున్న విమర్శనములను చదివితిని. "My mind is principally distracted" అను ప్రొఫెసరు జోన్సు గారి ఇంగ్లీషునకు నామనస్సు ముఖ్యంగా కలవరపడుచున్నది అనెడు అర్థమేకాని, ఆంధ్రభాషా గ్రామవర్తమాని గడచిన మార్చి 7వ తేది పత్రికలో వ్రాయబడిన ప్రకారము మనస్సు రెండు భాగములు అయినదను తాత్పర్యము 'distracted' అను ఇంగ్లీషు పదమునకు లేదు....”

సాహిత్యపరమైన వ్యాసాలేకాక,నాటక ప్రదర్శనలమీద, సమకాలిక పత్రికలమీద ఆంధ్రభాషా గ్రామవర్తమానిలో సమీక్షలు ప్రచురించ బడినట్లు చెప్పడానికి ఆధారాలున్నాయి. వేదం వేంకటరాయశాస్త్రి శిష్యులు, అభిమానులు ఆంధ్రభాషాభిమాని సమాజాన్ని నెల్లూరులో స్థాపించుకొన్నారు. ఈ సంస్థ కార్యక్రమాలపై పత్రికలలో వెలువడిన సమీక్షలను ఒకచిన్న కరపత్రంగా 1900లో ప్రచురించారు. ఈ సంస్థ ప్రదర్శించిన వేంకటరాయశాస్త్రి శాకుంతల నాటక ప్రదర్శనమీద ఆంధ్రభాషా గ్రామవర్తమానిలో వచ్చిన సమీక్షలో కొంత భాగాన్ని ఈ కరపత్రంలో చేర్చారు. వ్యావహారిక భాషలో రాయబడిన వ్యాసాన్ని గ్రాంథికభాషలోకి మార్చి శకటరేఫలు, అరసున్నలు చేర్చి పునర్ముద్రించారు. "ఈ నాటకమును తే17ది శనివారము నెల్లూరు ఆంధ్రభాషాభిమాని సమాజమువారు ఆడి, తమవిద్యను చమత్కారమును కనుపఱచినదేగాక నాటకమును చూడవచ్చిన వారి కందటికిని అత్యంతానందము గలుగజేసిరి. శాస్త్రులవారి పాండిత్యము ఈ నాటకము వలనఁ బ్రకాశముగా నెల్లూరి పురవాసులందటికిని విశదమాయెను.