పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

128

దంపూరు నరసయ్య


చూపుతాడు. "ప్రభుత్వం ఉరిశిక్ష అమలుచేసి ప్రాణంతీయగలదుకాని, మరణించిన వ్యక్తిని బ్రతికించలేదు. ఆలోచనాపరులెవరూ మరణశిక్షను ఆమోదించరు" అంటాడు. మరణశిక్షకు బదులు "కఠిన కారాగార శిక్ష, ద్వీపాంతరవాస శిక్ష విధిస్తే చాలని” ఈ వ్యాసంలో ప్రతిపాదిస్తాడు.69 నూటఅయిదేళ్ళక్రితం, ఒక చిన్న స్థానిక పత్రికలో మరణశిక్ష రద్దుపరచమని ప్రభుత్వాన్ని అర్ధించడాన్ని బట్టి నరసయ్య ఎంత గొప్ప మానవతావాదో బోధపడుతుంది. అట్టడుగు వర్గాల ప్రజలతో మమేకమై, వారి సమస్యలను సానుభూతితో అర్ధంచేసుకొని, వారిపక్షాన నిలబడడంలో ఆయన ఎవరికీ తీసిపోడు.

సాహిత్య విషయాలు

దేశభాషా పత్రికలమీద నివేదికలు సమర్పించిన ప్రభుత్వ అనువాదకులు పత్రికలలోని రాజకీయ అంశాలను స్పృశించారుకాని సాహిత్య విషయాల జోలికి పోలేదు. ఆంధ్రభాషా గ్రామవర్తమానిలో సాహిత్య వ్యాసాలు, పుస్తక సమీక్షలు, సాహిత్య లేఖలు ప్రచురించబడినట్లు కొన్ని నిదర్శనాలు కనిపించాయి. తన ప్రతాపరుద్రీయ నాటకాన్ని ఆంధ్రభాషా గ్రామవర్తమానిలో సమీక్షించినదెవరో తెలుసుకోవాలనే కుతూహలంతో వేదం వేంకటరాయశాస్త్రి మిత్రుడు పూండ్ల రామకృష్ణయ్యకు లేఖ రాశాడు. అందుకు రామకృష్ణయ్య రాసిన సమాధానం.70

నెల్లూరు

28-5-1900

ఆర్యా, నమస్కారములు

తాము తేది 23 వ్రాసిన జాబుకు జవాబు. దంపూరు నరసయ్యగారికి పుస్తకము నేనిచ్చినాను. వారు నిక్కము నాయందు విశ్వాసముంచినారు. ప్రతాపరుద్రీయమును గురించి వారే వ్రాసినారు. ఉండూరు పత్రికగాన మన పక్షము వారెవరైన వ్రాసినచో ప్రకటించెదరు.

ఇట్లు, విధేయుడు

పూండ్ల రామకృష్ణయ్య

దీంతో వ్యావహారిక భాషలో రచించబడ్డ కన్యాశుల్క నాటకాన్ని, పరిమితంగా వ్యావహారిక భాషను పాత్రోచితభాష పేరుతో ప్రవేశపెట్టిన ప్రతాపరుద్రీయాన్ని నరసయ్య సమీక్ష చేసినట్లయింది.

సూర్యాలోకం, ఆంధ్రభాషా గ్రామవర్తమాని కంటె ఒక సంవత్సరం ముందు పుట్టింది. మొదట వేదం వేంకటరాయశాస్త్రి మిత్రబృందం ఈ పత్రికను ప్రోత్సహించింది. నరసయ్య