పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

126

దంపూరు నరసయ్య


మద్రాసు మహాజనసభ స్థాపనలో, ఆ సంస్థ కార్యక్రమాలలో ఆయన క్రియాశీల సభ్యుడుగా పాల్గొని ఉంటాడని తోచింది. ఏటా అఖిల భారత కాంగ్రెసు సభలు జరుగుతున్నా, తాను భావించిన గ్రామ సంఘాలు మద్రాసు మహాజనసభకు అనుబంధంగా పనిచెయ్యాలని అభిలషించడంవల్ల, ఆ సంస్థతో ఆయనకున్న అనుబంధం స్పష్టమవుతుంది.

ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడానికి మద్రాసు మహాజనసభకు అనుబంధంగా గ్రామరైతు సంఘాలు ఏర్పడాలని నరసయ్య పిలుపిచ్చాడు. దేశాభివృద్ధి కోసం ప్రజలు గ్రామసంఘాలను, తాలూకా సంఘాలను, జిల్లా సంఘాలను నిర్మించాలని సలహా ఇచ్చాడు. ప్రతి రైతు గ్రామసంఘంలో సభ్యుడు కావాలి. ప్రభుత్వోద్యోగులు గ్రామసంఘాలలో సభ్యులుగా చేరడం ఆయనకు ఆక్షేపణ కాదుకాని, “ఈ గ్రామ సంఘాలకు ప్రభుత్వోద్యోగులు అధ్యక్షులుగా ఉండకూడదు” అని ఖండితంగా చెప్పాడు. గ్రామాధికారులు గ్రామ సంఘాల అధ్యక్షులై, ఆ సంఘాలను నిర్వీర్యం చేస్తారని, లేదా ప్రభుత్వ అనుకూల సంస్థలుగా తయారు చేస్తారని ఆయన అభిప్రాయమై ఉంటుంది. ప్రతి సభ్యుడు కనీసం ఒక అణా అయినా సంఘానికి సభ్యత్వరుసుం చెల్లించాలి. గ్రామ సంఘాలు వసూలుచేసిన చందా మొత్తంలో మూడో భాగాన్ని మద్రాసు మహాజనసభకు పంపాలని, ఈ సంఘాలకు సంబంధించిన ఒక విస్తృత ప్రణాళికను చర్చించాడు. దేశక్షేమానికి సంబంధించిన ప్రతి అంశాన్ని ఈ గ్రామసంఘాలు చేపట్టాలని ఒక కార్యాచరణను ఊహించాడు. మద్రాసు ప్రెసిడెన్సీ అంతటికీ ఒక విశాల ప్రాతిపదికమీద, మద్రాసు మహాజనసభకు అనుబంధంగా గ్రామరైతు సంఘాలను ఏర్పాటు చెయ్యాలని అభిలషించాడు. రాజకీయ కార్యాచరణకు ఒక ప్రాతిపదికను ఏర్పరిచాడు.66 రైతుసంఘాల ఏర్పాటును గురించి నరసయ్య ముందుచూపు ఈ వ్యాసంలో వ్యక్తమయింది.

ఆంధ్రభాషా గ్రామవర్తమాని ప్రచురిస్తున్న కాలంలో నరసయ్యకు బ్రిటిష్ ప్రభుత్వంపట్ల సదభిప్రాయం ఉంది. ఏవో కొన్ని లోపాలున్నా, మొత్తంమీద దేశప్రజలు ఇంగ్లీషు పాలనలో బాగుపడ్డారనే సంగతి గుర్తుంచుకొని తమసాధక బాధకాలను ప్రభుత్వ దృష్టికి తీసుకొని రావాలని ఒక వ్యాసంలో సలహా ఇస్తాడు. ప్రజాభిప్రాయాన్ని సమీకరించడానికి, వ్యక్తీకరించడానికి ప్రజాసంఘాల ఏర్పాటు, సభలు సమావేశాలు, మహజరులు, పత్రికలు సరియైన వాహికలని ఆయన విశ్వసించాడు. ఈ నాలుగు అంగాలు చక్కగా అభివృద్ధి చెందితే, ప్రజలు హాయిగా జీవించగలరని భావిస్తాడు. మేధావులు ఈ నాలుగు సాధనాలను విజ్ఞతతో, శ్రద్ధగా వాడుకోవాలని సూచిస్తాడు.67 ఆనాటి దేశ నాయకుల ఆలోచనలకు,