పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

122

దంపూరు నరసయ్య


వెలువడిన వ్యాసంలో “తగినంత సాగునీరు అందక, పంటలు పండక ఎన్నో బాధలు పడుతున్నాము. పరిస్థితులు ఇంత దుర్భరంగా ఉన్నా వెంకటగిరి రాజా మా కష్టాలు పట్టించుకోడంలేదు. నీరు అవసరమైన సమయంలో, పొలాలకు నీరు అందక పంటలు ఎండుతున్నా, సాగుచెయ్యకుండా బీడు పెట్టిన పొలాలను పరిశీలించడానికి అధికారులెవరూ రారు. శిస్తు రెమిషను ఇవ్వరు. శిస్తులు కట్టమని దౌర్జన్యం చేస్తారు. సివిల్‌కోర్టుల్లో, సమ్మరీ దావాలు (summary suits) తెచ్చి వేధిస్తారు. కఠినంగా నిబంధనలు అమలుచేసి శిస్తులు రాబట్తారు.” ఇదీ వ్యాసం సారాంశం. మరొక వ్యాసంలో నరసయ్య వెంకటగిరి ప్రాంతంలో కరవు పరిస్థితిని వివరించాడు. ఒక రైతు కరవు పరిస్థితిని వివరిస్తూ రాసిన రిపోర్టు ప్రచురించాడు.49 ఈ రైతుల అసంతృప్తి రగిలి, రాజుకొని ముప్పై ఏళ్ళ తర్వాత జమిందారీ వ్యతిరేక ఉద్యమంగా జ్వలించింది. ఈ ఉద్యమం అగ్నిగుండం నుంచి జమీన్‌రైతు పత్రిక ఆవిర్భవించింది. వెంకటగిరి జమిందారీ రైతులకు వెన్నుదన్నుగా నిలబడి వారి కడగళ్ళను లోకానికి చాటిన తొలిపత్రిక ఆంధ్రభాషా గ్రామవర్తమాని అని, వెంకటగిరి జమీందారీ రైతు ఉద్యమానికి ఈ వ్యాసమే అంకురార్పణ చేసిందని ఈ రచయిత గట్టిగా నమ్ముతున్నాడు.

కోర్టాఫ్ వార్డ్సు బిల్లు (Court of Wards Bill)

తనకు జమీందారీ వ్యవస్థ మీద రవ్వంత నమ్మకం లేకపోయినా, ప్రభుత్వం అపరిమిత అధికారాలను తన గుప్పిట్లో ఉంచుకొని నిరంకుశంగా వ్యవహరించడాన్ని నరసయ్య అంగీకరించలేదు. కోర్టాఫ్ వార్డ్సు బిల్లును ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆయన జమిందార్ల మీద సానుభూతితో రాసిన వ్యాసం ఇదొక్కటే. ఈ వ్యాసంలో చట్టసభ పరిశీలనలో ఉన్న ముసాయిదా బిల్లులోని లోపాలను బహిర్గతం చేశాడు. శారీరక, మానసిక వైకల్యం వల్ల తమ ఎస్టేట్లను పరిపాలించుకొనే సామర్యంలేని జమీందార్ల ఎస్టేట్లను ప్రభుత్వం తన అజమాయిషీలోకి తెచ్చుకోడానికి ఈ బిల్లు వీలు కలిగిస్తుంది. “ఇంతటి నిరంకుశాధికారం ప్రభుత్వానికి ఉండకూడదు. ఇటువంటి పరిస్థితులు ఏర్పడినపుడు జమీందారీ భవితవ్యాన్ని తీర్మానించడానికి హైకోర్టు ఫుల్‌బెంచికి నివేదించాలి. ఒక జమీందారీ ఎన్నిచిక్కుల్లో ఉన్నా కోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వం నడుచుకోవాలి” అని తన అభిప్రాయం తెలియచేశాడు.50 ఆయన రాగద్వేషాలకు అతీతంగా సమస్యలను పరిశీలించేవాడని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.

జమిందార్లకు, భూకామందులకు వ్యతిరేకంగా రాయడంవల్ల సంపన్న భూస్వామ్యవర్గాలు నరసయ్య పత్రికలకు సహకరించి ఉండవు. సామాజిక విషయాలలో, భాషా విషయాలలో నరసయ్య వైఖరి చాలామంది జమిందార్లకు, సామాన్య పాఠకులకు