పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

121


అజమాయిషీకే విడిచిపెట్టబడ్డాయి. దాంతో రైతులను పీడించి, తమ చిత్తం వచ్చినట్లు శిస్తులు, పుల్లరులు వసూలుచేయడానికి జమిందారులకు అవకాశం ఏర్పడింది. నరసయ్య ఒక వ్యాసంలో ఈ సంగతులు వివరించాడు. జమీందార్లు దొంగలెక్కలు తయారుచేయించి, సక్రమంగా శిస్తు చెల్లించకుండా ప్రభుత్వాన్ని వంచిస్తున్నారని ఆరోపించాడు. ఇటువంటి మోసాలను అరికట్టడానికి జమీందారీ గ్రామాలను సర్వే చేయించి, హద్దులు నిర్ణయించి, ఆయా గ్రామకరణాలను ప్రభుత్వమే నియమించాలని ప్రతిపాదించాడు. గ్రామకరణాలను నియమించే అధికారం జమీందార్ల చేతిలో ఉన్నంతవరకు వారు ఇటు రైతులను, అటు ప్రభుత్వాన్ని వంచిస్తూనే ఉంటారని, ప్రభుత్వం చర్యతీసుకోకుండా ఎందుకు ఊరకుందని ప్రశ్నిస్తాడు. ఈ అంశంమీదనే మరొక వ్యాసంలో జమిందారీ, శ్రోత్రియం గ్రామోద్యోగులకు ప్రభుత్వమే జీతబత్యాలు చెల్లించే చర్య చేపట్టాలి. అందువల్ల రైతులకు, ప్రభుత్వానికి లాభం చేకూరుతుంది. ఈ చర్యవల్ల దుఃఖించేవారు జమీందార్లు, శ్రోత్రియందార్లు మాత్రమే అని రాస్తాడు.45

జమిందారీ పరిపాలనమీద రాస్తూ, వెంకటగిరి సంస్థానం దివాను సామర్థ్యంమీద నరసయ్య సందేహం వెలిబుచ్చాడు. పై అధికారులంతా ఇంగ్లీషువారే అయినపుడు ఇంగ్లీషు రాని దివాను ఏ విధంగా తన విధులు నిర్వహించగలడని ఒక వార్త రాశాడు.46 వెంకటగిరి జమిందారుకు ఆయన సోదరులకు ఆస్తి వ్యవహారంలో మనస్పర్ధలు కలిగి కోర్టుకెక్కారు. తర్వాత రాజీ కుదిరినా అన్నదమ్ముల మధ్య విరోధాలు చాలాకాలం సమసిపోలేదు. తమ్ముడు ముద్దుకృష్ణయ్య ప్రతి విషయంలో అన్నతో పోటీపడి అతిశయం చూపాడు. ఈ పరిస్థితులను వివరిస్తూ నరసయ్య ఒక వార్త ప్రచురించాడు. "సంస్థాన సేవకులు, ఆశ్రితులు ప్రత్యర్థి వర్గంతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోకూడదని ఇటీవల జమీందారు ఒక పనికిమాలిన ఆజ్ఞ జారీచేశాడు. దాంతో క్షురకులు, రజకులు కూడా స్వేచ్చగా తమ వృత్తి చేసుకోడానికి అవకాశం లేకుండా పోయింది. వెంకటగిరి ఊరు ఊరంతా రెండు వర్గాలుగా చీలిపోయింది. ప్రజలు శుభాశుభాలకు బంధువుల ఇళ్ళకు వెళ్ళడం మానుకొన్నారు. వెంకటగిరిలో పార్టీ వాతావరణం నెలకొని ఉంది. ఇంగ్లీషువారి పరిపాలనలోనే ఇటువంటి దారుణ పరిస్థితి ఏర్పడింది” అని తీవ్రంగా రాశాడు.47

శార్దూలశతకకర్త విక్రాల రంగాచార్యులు వెంకటగిరి జమీందారు రాజగోపాలకృష్ణతో ఘర్షణపడి, తన సర్వస్వం కోల్పోయిన ఉదంతం నరసయ్య కళ్ళముందే జరిగింది.48 అయినా ధైర్యంగా వెంకటగిరి జమీందారీ రైతులకష్టాలు మొట్టమొదట పత్రిక ద్వారా లోకానికి తెలియచేసిన ఘనత నరసయ్యకు చెందుతుంది. ఇరవయ్యో శతాబ్ది ఆరంభంలో జమిందారీ రైతుల బాధలు ఒక స్థానిక పత్రిక ప్రచురించడం సామాన్యమైన విషయం కాదు. “వెంకటగిరి జమిందారీ రైతులు” శీర్షికతో ఆంధ్రభాషా గ్రామవర్తమానిలో