పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

115


చిన్న గ్రామాలను కలిపి ఒక కోర్టు నిర్వహించాలని, గౌరవప్రదమైన జీతంతో ఈ కోర్టు నిర్వహణను ఆయా గ్రామ మున్సిపులకు అప్పచెప్పాలని, మెట్రిక్యులేషను పాసయినవారినే గ్రామ మునిసిపులుగా నియమించి వారికి సివిలు, క్రిమినలు, రెవెన్యూ పరిపాలన బాధ్యతలను అప్పగించాలని ఆయన తన పత్రిక ద్వారా ఒక ఉద్యమం నడిపాడు. అవసరమైనపుడు 'గౌరవ' విలేజి మున్సిపులను నియమించి, వారికి ఈ కోర్టుల బాధ్యత అప్పగించవచ్చని సూచించాడు. గ్రామ న్యాయస్థానాల చట్టం పాసయి ఎన్నేళ్ళయినా అమలులోకి రాలేదని, “ఈ చట్టం అసలు అమలులో ఉందా? లేదా? సమర్ధులైన మున్సిఫులను ఎక్కడ నియమించారు? ప్రభుత్వానికి శిస్తు వసూలైతే చాలు. ఇంకేమీ పట్టదు” అని తీవ్రంగా రాశాడు. చివరకు తన కృషి ఫలించి, కోడూరు గ్రామ మునిసిపు విలేజికోర్టును చక్కగా నిర్వహించి, సంతృప్తికరంగా తీర్పు చెబుతున్నట్లు ఒక వార్త రాశాడు.23

రైతుపక్షపాతం

నరసయ్య నిరుపేద రైతుల కష్టాలను తన పత్రిక ద్వారా వెల్లడిచేశాడు. గ్రామీణ పేదరికాన్ని గురించి రాస్తూ, “తరచుగా కరవు కాటకాలు పలకరిస్తున్నాయి. రోజురోజుకూ గ్రామీణులు నిరుపేదలుగా మారుతున్నారు. గవర్నరులు వస్తారు పోతారు. పేద రైతుల పరిస్థితులు పైన ఉన్న దేవుడికి, ప్రభుత్వ అధికారులకు మాత్రమే తెలుసు” అని వ్యాఖ్యానిస్తాడు.24 రైతుల మధ్య గ్రామంలో ఉండి సొంత సేద్యం చేయడంవల్ల ఆయనకు రైతుల సమస్యలు క్షుణ్ణంగా తెలుసు. నీటిపారుదలశాఖ అధికారుల అవినీతి, నిరుపేద రైతులచేత ప్రభుత్వం బలవంతపు కుడిమరమ్మత్తు పనులు చేయించడం, గ్రామాధికారుల మోసాలు, పిలవని పేరంటంగా వచ్చి తొంగిచూచే కరవు కాటకాలవల్ల రైతులు నాదారయిపోవడం - దేనినీ నరసయ్య విడిచిపెట్టలేదు. “జమాబంది దగ్గరపడుతున్న కొద్దీ రైతులు నానా హైరానా పడుతున్నారు. ధాన్యం ధరపడిపోతూంది.” అంటూ రైతులు శిస్తుచెల్లించే విధానంలో మార్పులుతెచ్చి, వెసులుబాటు కలిగించాలని ప్రభుత్వాన్ని అర్థిస్తాడు. ఏ సంవత్సరం అసెస్మెంటు (assessment) ఆ సంవత్సరమే వసూలుచెయ్యకుండా,వచ్చే ఫసలీలో వసూలు చెయ్యాలని రైతుల పక్షాన ప్రార్ధించాడు. శిస్తు మొత్తం ఒక్కసారి కాకుండా, వాయిదాల పద్దతిలో వసూలు చెయ్యాలని సూచించాడు. గిట్టుబాటు ధర వచ్చేవరకు ధాన్యం అమ్మవద్దని, శిస్తు చెల్లించడానికి అవసరమైన ధాన్యంమాత్రమే అమ్మమని రైతులకు హితవు చెప్తాడు. “ప్రభుత్వం రైతులను కన్నబిడ్డలవలె చూచుకోవాలి. రైతునాశనమైతే, దేశం నష్టపోతుంది, ప్రభుత్వం నష్టపోతుంది.” అని హెచ్చరిస్తాడు.25