పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

110

దంపూరు నరసయ్య

నరసయ్య ఆంధ్రభాషా గ్రామవర్తమానిలో ఏయే విషయాల మీద రాశాడో సాకల్యంగా పరిశీలించి రాయడానికి అవకాశం లేదు. ప్రభుత్వ అనువాదకుడు తన నివేదికలలో చేర్చిన పరిమిత విషయాలు (షుమారు 160 అంశాలు) మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అనువాదకుడు తన సంకుచిత దృష్టికోణం నుంచి పరిశీలించి రిపోర్టు చేసిన సంగతులే - గ్రామ సమస్యల నుంచి, అంతర్జాతీయ వార్తల వరకు ఉన్నాయి. 1900లో 33 సంచికలలోని అంశాలు, 1901లో 43 సంచికలలోని విషయాలు ఈ రిపోర్టులలో పేర్కొనబడ్డాయి. ఈ రెండు సంవత్సరాలు పత్రిక సక్రమంగా వెలువడిందని చెప్పడానికి ఇంతకన్న బలమైన సాక్ష్యం ఏంకావాలి? ఈ రిపోర్టులలో పేర్కొనబడని కొన్ని సంచికల ప్రస్తావనలు ఇతర సాహిత్య ఆకరాల్లో, పత్రికల్లో వస్తాయి.13

వారంవారం ఆంధ్రభాషా గ్రామవర్తమాని 150 ప్రతులు అచ్చయ్యేవి. ఆ రోజుల్లో ఏ తెలుగుపత్రిక సర్క్యులేషనూ వేయి కాపీలకు మించలేదు. మద్రాసు నుంచి వెలువడే క్రైస్తవ మిషనరీల మాసపత్రిక “మెసెంజర్ ఆఫ్ ట్రూత్" (Messenger of Truth) ఒక్కటే 4800 ప్రతులు ముద్రించ బడుతున్న తెలుగు పత్రిక. ఆంధ్రప్రకాశిక (biweekly) 650 ప్రతులు, శశిరేఖ (bi-weekly) 550 ప్రతులు, హిందూజన సంస్కారిణి మాసపత్రిక 350 ప్రతులు, సత్య సంవర్ధని మాసపత్రిక, సూర్యాలోకం, దేశాభిమాని వారపత్రికలు 350 కాపీలు, రవి వారపత్రిక 250 కాపీలు, విడుదలవుతున్నట్లు తెలుస్తూంది. ఆంధ్రభాషా గ్రామవర్తమాని పరిమిత లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని పరిశీలిస్తే, ఈ సంఖ్య సమంజసంగానే తోస్తుంది. ఇంత తక్కువగా సర్క్యులేషను ఉండడంవల్లే ఆనాటి పత్రికలు ఇప్పుడు లభించడంలేదని భావించడానికి అవకాశం ఉంది. అయితే, నెలనెలా 100 నుంచి 150 ప్రతులదాకా ముద్రించబడుతూ వచ్చిన అముద్రిత గ్రంథ చింతామణి పత్రిక ప్రచురణ ఆరంభమైన నూట ఇరవై సంవత్సరాల తర్వాత, ఇప్పుడు కూడా అనేక ప్రాచీన గ్రంథాలయాల్లో, వ్యక్తుల పుస్తక సంచయాల్లో భద్రంగా ఉండడం ఆశ్చర్యం కలిగించక మానదు. ఈ పత్రిక ఒక్కటేకాదు, ఆనాటి ఇతర సాహిత్య పత్రికలు ఒకటి రెండు కాపీలైనా ప్రాచీన గ్రంథాలయాల్లో జాగ్రత్త చేయబడి ఉన్నాయి.14 వార్తాపత్రికలకన్నా, సాహిత్య పత్రికలను ప్రజలు పదిలపరచు కొన్నారని అనిపిస్తుంది. పత్రికల ఆకారం కూడా ఒక నిర్ణాయక అంశంగా మారినట్లుంది. పీపుల్స్ ఫ్రెండ్, ఆంధ్రభాషా గ్రామవర్తమాని 'రాయల్ ఫారం' మిద ముద్రించ బడడంవల్ల జాగ్రత్త చేయడం కష్టం అయి ఉంటుంది.

నరసయ్య దినచర్యలో ఆంధ్రభాషా గ్రామవర్తమాని ప్రచురణ ప్రస్తావన ఉంది. "Sunday - Monday and half of Tuesday engaged in writing leaders, picking up news and writing for the issues of 'గ్రామవర్తమాని' for 25th May and 1st June 1901... By Tuesday afternoon work of 'గ్రామవర్తమాని' of 25th May fully