పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

109


తన పత్రిక పరిధి తెలుగుజిల్లాల పల్లెటూళ్ళకు విస్తరించాలని నరసయ్య భావించినట్లు ఈ ప్రకటనవల్ల బోధపడుతూంది.

నేటివ్ న్యూస్‌పేపర్ రిపోర్టులు

ఆంధ్రభాషా గ్రామవర్తమాని సంచికలు ఇప్పుడు లభించకపోయినా, ఆ పత్రికలోని కొన్ని వార్తలు, వ్యాసాలు, సంపాదకలేఖలు ఇంగ్లీషు అనువాదరూపంలో మనకు మిగిలాయి. బ్రిటిష్ ప్రభుత్వం 1876 ప్రాంతాలకే దేశభాషా పత్రికలమీద నిఘా ఏర్పాటు చేసింది. ప్రభుత్వ అనువాదకులు దేశభాషలలో వెలువడే పత్రికలను పరిశీలించి, అవసరమైన విషయాలను అధికారులకు నివేదించేవారు. ఆ నివేదికలలో పత్రికలకు సంబంధించిన వివరాలు కూడా పొందు పరచేవారు. పత్రిక ఏ ప్రదేశం నుంచి ప్రచురించబడుతున్నది, ఎన్నిరోజులకు ఒకసారి వెలువడేది, ప్రచురణ తేది, ఏ తారీకున ప్రభుత్వ కార్యాలయానికి అందింది, ఎన్ని ప్రతులు ముద్రించబడుతున్నది మొదలైన వివరాలు నమోదు చేసేవారు. ఈ రహస్య నివేదికలవల్లే ఇప్పుడు లభించని అనేక పత్రికల వివరాలు, స్వరూప స్వభావాలు గ్రహించడానికి వీలుపడింది. ఇవి "నేటివ్ న్యూస్ పేపర్ రిపోర్టులు" (Native Newspaper reports) "కాన్‌ఫిడెన్షియల్ న్యూస్ పేపర్ రిపోర్టులు" (Confidential Newspaper reports) మొదలైన పేర్లతో చెన్నైలోని తమిళనాడు ఆర్కైవ్స్‌లో భద్రపరచబడి ఉన్నాయి.12

ప్రారంభ సంచిక

ఒంగోలు వెంకటరంగయ్య ఆంధ్రభాషా గ్రామవర్తమాని 1900లో ప్రారంభమైనట్లు పేర్కొన్నాడు. ఆ పత్రిక ఎప్పుడు ప్రారంభమైందో మరింత నిర్దుష్టంగా చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లభించాయి. నెల్లూరు సాహిత్య మాసపత్రిక అముద్రిత గ్రంథ చింతామణి అధిపతి పూండ్ల రామకృష్ణయ్య తన మిత్రుడు వేదం వేంకటరాయశాస్త్రికి 1900 మే 22న రాసిన ఉత్తరంలో నరసయ్య పత్రికను ప్రస్తావించాడు....... దంపూరు నరసయ్యగారు ప్రతాప గురించి వారు నూతనముగా ప్రకటించుచున్న ఆంధ్రగ్రామవర్తమాని అను పత్రిక యొక్క 3 సంచికలో విమర్శించినారు. అందులో మన విమతులందరికి బుద్ధి చెప్పినారు” అని పేర్కొనడంవల్ల ఆంధ్రభాషా గ్రామవర్తమాని 3వ సంచిక అంతకుముందు కొద్దిరోజుల క్రితమే విడుదలైందనే అభిప్రాయం వ్యక్తమవుతూంది. నేటివ్ న్యూస్ పేపర్ రిపోర్టులలో ఏప్రిల్ 28వ తారీకు సంచిక ప్రస్తావన మొదటిసారి వస్తుంది. తొలిసంచిక ఈ తేదీన ప్రచురించబడి ఉంటే, మూడో సంచిక మే 12వ తేదీ నాటిది అవుతుంది.