పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

108

దంపూరు నరసయ్య

భాషకు సంబంధించి నరసయ్యకు కచ్చితమైన అభిప్రాయాలున్నాయి. 1883 నాటికే ఆయన వ్యావహారిక భాషావాది. ఆయన కన్యాశుల్క నాటక సమీక్షలో పండిత భాషను తిరస్కరించి, ప్రజల భాషను ఆహ్వానించిన సంగతి తెలిసినదే. ఇప్పుడు గ్రామస్థాయిలో ప్రజల సమస్యలపై దృష్టి నిలిపి పత్రిక ఆరంభిస్తున్నాడు. ఆయన కార్యరంగం కోడూరు చుట్టుపట్ల ఉన్న పల్లెటూళ్ళు. ఆయన పాఠకులు గ్రామీణ ప్రజలు. వారి కోసం తనకిష్టమైన ఇంగ్లీషు పత్రికా రచన విడిచిపెట్టి, తెలుగు జర్నలిజంలోకి మారాడు. చెన్నపట్నంలో ఉండి, రెండు దశాబ్దాలు జాతీయ అంతర్జాతీయ వ్యవహారాలపై వ్యాఖ్యానిస్తూ పత్రిక కొనసాగించి, కోడూరు వంటి కుగ్రామాల స్థానిక సమస్యలను విశ్లేషించి పరిష్కారాలు సూచించడానికి ఒక పత్రిక స్థాపించడం నరసయ్యకే చెల్లింది. యవ్వనావేశంలో 'నెల్లూరు పయొనీర్' పత్రికను ఇంగ్లీషులో తీసుకొని వచ్చాడుకాని, ఇప్పుడైతే ఆ పత్రికను తెలుగులోనే వెలువరించి ఉండేవాడు. ఆంధ్రభాషా గ్రామవర్తమానికి ముందూ వెనుక ఎన్నో పత్రికలు పుట్టిగిట్టినా, తెలుగు పత్రికల చరిత్రలో గ్రామీణ ప్రజలకోసం, అదీ నిరు పేద రైతుల ప్రయోజనాలకోసం ప్రత్యేకంగా పత్రిక నడిపిన ఉదంతం కన్పించదు. పత్రికా నిర్వహణలో ఇది అపూర్వ ప్రయోగం. “ఇది ముఖ్యముగా పల్లెటూళ్ళకును, నచ్చటి జనమునకు నుద్దేశింపఁబడినది. పల్లెటూళ్ళ రైతు లనేకురు తమ కష్టముల నీ పత్రికా ముఖమునఁ గెలుపుచుండిరి....... జీవించియుండిన కొలది కాలమును జనోపయోగములగు పలు విషయము లిందుఁ జర్చింపఁ బడుచుండెను. ఇది ముఖ్యముగా నెల్లూరు తాలుకా కోడూరు గ్రామము కొఱకు పుట్టినది” అని ఒంగోలు వెంకటరంగయ్య వివరించాడు.9

తను నిర్దేశించుకొన్న లక్ష్యాలవల్ల సాధారణ పాఠకులు, చందాదారులు ఆంధ్రభాషా గ్రామవర్తమాని మీద ఆసక్తి కోల్పోతారనే సంకోచం నరసయ్య మనసులో లేకపోలేదు. తనది చిన్న వార్తాపత్రిక అని, గ్రామ సమస్యలమీద, ప్రత్యేకంగా కోడూరు గ్రామ సమస్యల మీద దృష్టి పెట్టడంవల్ల, తరచుగా గ్రామాణుల స్థితి గతులమీద రాయవలసి వస్తూందని, పాఠకులు తన పత్రిక పరిమితులు దృష్టిలో ఉంచుకొని, విముఖత చూపకుండా ఆదరించాలని పలుమార్లు విజ్ఞప్తి చేశాడు. “ఇది చిన్న పత్రిక. ఇందులో అప్పుడప్పుడూ నెల్లూరుజిల్లా వార్తలను ప్రచురిస్తూ ఉంటాము. ఆయా విలేకరులు పంపిన వార్తలను, రచనలను కూడా ప్రచురిస్తాము. ప్రభుత్వాధికారులను, కొత్తగా జిల్లాకు వచ్చిన కలెక్టరును ఈ పత్రికలో ప్రచురించబడుతున్న వార్తలను శ్రద్ధగా చదవమని కోరుతున్నాం” అని విన్నవించుకొన్నాడు. 10 1901 మార్చి, ఏప్రిల్ కళావతి మాసపత్రికలో ప్రచురించిన ప్రకటనలో “ఇది తెలుగు పల్లెటూళ్ళ జనులకుగాను సులభశైలిలో నెల్లూరు నుండి దంపూరు నరసయ్యగారిచే ప్రతి శనివారమును ప్రకటించబడు వార్తాపత్రిక” అని వివరణ వంటి వాక్యం ఉంది.11 ఆ పత్రిక ప్రారంభమైన ఏడాది తర్వాత, బహుశా