పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

107


నరసయ్యకు జర్నలిజంతో ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ “ఆ రోజుల్లో Tale of Two Cities లాగా జర్నలిజంపై ఇంత పిచ్చి కనపరచినవాడు అపురూపం” అని బంగోరె నార్లకు ఒక ఉత్తరంలో రాశాడు.5 మద్రాసు మహానగరంలో ప్రారంభమైన నరసయ్య జర్నలిజం ప్రస్థానం నెల్లూరుజిల్లాలోని కోడూరు గ్రామంవరకు సాగి సమాప్తమయింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో 'ఆంధ్రభాషా గ్రామవర్తమాని' చివరి మజిలీ. మూడు ఇంగ్లీషు పత్రికలు ప్రచురించిన పాతికేళ్ళ జర్నలిజం అనుభవంతో తెలుగు పత్రికా సంపాదకుడుగా కొత్త పాత్రలో ప్రవేశించాడు.

తన కళ్ళముందే ఆంధ్రభాషా గ్రామవర్తమాని ప్రారంభమూ, ముగింపు జరిగిన కథ ఒంగోలు వెంకటరంగయ్య ఇట్లా వివరించాడు. “దంపూరు నరసయ్యగారు 1897-98 ప్రాంతములలోఁ జెన్నపట్నము నుండి నెల్లూరికిఁ దిరుగ వచ్చి, ఇచ్చట స్థావరము కుదుర్చుకొని 1900 సంవత్సరమున ఆంధ్రభాషా గ్రామవర్తమాని యనునొక చిన్న వారపత్రికను ప్రారంభించిరి.... పాఠకాదరణము చాలమిని, ప్రవర్తకుని వార్ధక్యము వలనను నియ్యది శైశవముననే యంతరించినది.” ఈ పత్రిక వెలువరించే నాటికి నరసయ్య వార్ధక్యంలో ఉన్నట్లు వెంకటరంగయ్య అభిప్రాయపడ్డాడు.6 “వార్ధక్యం అంటే ఎన్నేళ్ళనోకాని అప్పటికి నరసయ్యగారి వయస్సు 51" అని పెన్నేపల్లి గోపాలకృష్ణ వ్యాఖ్యానించాడు.7 ఈ పత్రిక నడుపుతున్న కాలంలో నరసయ్య కోర్టు పనులమీద తరచుగా వెంకటరంగయ్యను కలుసుకొంటూనే ఉన్నాడు. ఈ సంగతి ఆయన తన దినచర్యలో పలుమార్లు ప్రస్తావించాడు. అప్పటి నరసయ్య స్వరూపం, పరిస్థితి ఆయన వార్ధక్యదశలో ఉన్నట్లు అభిప్రాయం కలిగించి ఉండాలి. ఆనాటి భారతీయుల సగటు ఆయుర్దాయం 30 సంవత్సరాలో, అంతకన్న తక్కువో! పైగా నరసయ్య ఆర్థికంగా చితికిపోయి, జీవిత పోరాటంలో ఓడి నెల్లూరు చేరిన సందర్భం.8

1856లో 'దినవర్తమాని' పేరుతో ఒక తెలుగు వారపత్రిక వెలువడింది. కొక్కొండ వెంకటరత్నం 'ఆంధ్రభాషా సంజీవని' పత్రికను తర్వాత 1871లో ప్రారంభించాడు. వీటి స్ఫూర్తితో నరసయ్య తన పత్రికకు “ఆంధ్రభాషా గ్రామవర్తమాని” అని పేరు పెట్టినట్లుంది. ఆంధ్ర భాషలో గ్రామవర్తమానం తెలిపే పత్రిక అని అర్థం స్ఫురించేటట్లు ఈ పేరు ఎంపిక చేసినట్లుంది. ఆంధ్ర భాష మీద తనకున్న ప్రీతిని, అభిమానాన్ని వ్యక్తం చేయడానికీ, తన పత్రిక భాషా సాహిత్య విషయాలనూ ఆదరిస్తుందని ధ్వనించేందుకు 'ఆంధ్ర' పదం చేర్చి ఉంటాడు. ఆయన పీపుల్స్ ఫ్రెండ్ ప్రారంభించిన రెండేళ్ళకే, తెలుగులో వారపత్రికను వెలువరించేందుకు ప్రయత్నం చేసినా, ఇంతకాలానికి ఆ అభిలాష ఆకృతి ధరించింది.