పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

106

దంపూరు నరసయ్య


అడుగడుగునా ఎదురయిన కష్టాలు, ఆర్ధిక ఇబ్బందులు అధిగమించి, సమకాలికుల కంటే విలక్షణమైన ఆలోచనలతో, ఆశయసాధనకోసం పత్రికా రచయితగా, సంపాదకుడుగా జీవితం ఆరంభించాడు. ఈ క్రమంలో ఎన్నో వ్యతిరేక శక్తులతో సంఘర్షించవలసి వచ్చింది. తన సర్వస్వం ఒడ్డి పోరాడినా, పత్రిక కొనసాగించడం తన శక్తికి మించినపనే అయింది. ఆనాటి ఏ పత్రిక చరిత్ర చూచినా దాదాపుగా ఇదే కథ. పత్రిక కొనసాగించడానికి చివరకు నరసయ్య ఇల్లాలి నగలు కూడా తాకట్టు పెట్టవలసి వచ్చింది.2 తలకుమించిన రుణభారం తప్ప తనకు మిగిలిందేమి లేదు. తొమ్మిదేళ్ళు కూడా నిండని పసివాణ్ణి, అనారోగ్య పీడితురాలైన భార్యను వెంటపెట్టుకొని నెల్లూరు చేరాడు. "How many wicked men and women have worried my path. God thy hand I trust in all events.."3 అని దినచర్యలో రాసుకున్న వాక్యం ఈ నిస్పృహను సూచిస్తుంది.

నరసయ్య నెల్లూరు రావడానికి మరొక కారణం ఉంది. నాలుగేళ్ళ వయసున్న ఒకే ఒక కుమారుణ్ణి అక్క మీనాక్షమ్మకు దత్తత ఇచ్చాడు. ఆమెకు నెల్లూరు సమీపంలో కోడూరు గ్రామ పరిసరాల్లో పెద్ద భూస్థితి ఉంది. ఆమె అమాయకత్వం వల్ల, అశక్తతవల్ల ఆ భూములన్నీ తాకట్టుపడ్డాయి. బాకీ తీర్చకపోవడం వల్ల పొలాలు రుణదాతల స్వాధీనమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ ఆస్తి వ్యవహారాలు చక్కపెట్టాల్సిరావడం వల్ల కూడా నరసయ్య నెల్లూరులో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు తనకు వ్యవసాయమే జీవనాధారమైంది.

కోడూరు వ్యవసాయంతో నరసయ్య అనుబంధం ఈనాటిది కాదు. ఇరవై ఏళ్ళుగా ఆ పొలాల మీద అజమాయిషి తనదే. పనులకాలంలో కోడూరులో ఉండి వ్యవసాయం మంచి చెడ్డలు చూచేవాడు. ఫలసాయంలో అక్కకు పదిపుట్లిచ్చి, మిగిలింది తాను తీసుకొనేవాడు.4 ఈ అయివోజుతోనే మద్రాసులో ఉన్నన్ని రోజులు నెట్టుకొచ్చినట్లుంది. కోడూరు, భట్టారంవారి కండ్రిగ, పొగడదొరువు కండ్రిగ, విలుకానిపల్లె మొదలయిన ఊళ్ళన్నీ తనకు పరిచయమే. అక్కడి ప్రజల కష్టసుఖాలు తనకు తెలుసు. ఈ పల్లెటూళ్ళలో మసలడంవల్ల అక్కడి పేదల కడగళ్ళు, భూస్వాముల ఆగడాలు, పెత్తందార్ల అక్రమాలు, గ్రామాధికారుల మాయలు, మోసాలు, ఏవీ ఆయన దృష్టినుంచి తప్పిపోలేదు. నిత్యం ఆ గ్రామాలకు రాకపోకలు సాగించడం వల్ల కొత్త సంగతులు తెలిశాయి. అక్కడి ప్రజల దయనీయ పరిస్థితులను ప్రభుత్వం ముందుంచడానికి, దేశప్రజల దృష్టికి తీసుకొని రావడానికి తనకొక పత్రిక అవసరం. పత్రిక తన ఆయుధం. అచ్చాఫీసు నడపడం తన ప్రవృత్తి. ఎన్ని సమస్యలు ఎదురైనా పత్రిక నడపాలనే పిపాస నరసయ్యలో తీరనేలేదు.