పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7

చివరి మజిలీ ఆంధ్రభాషా గ్రామవర్తమాని

నరసయ్య పీపుల్స్ ఫ్రెండ్ పత్రికను ఎంతో 'కీర్తిప్రదం' గా నిర్వహించినట్లు ఒంగోలు వెంకటరంగయ్య పేర్కొన్నాడు. పత్రిక నిలిచిపోయిన పుష్కరకాలం తర్వాత కూడా గురజాడ వంటి బుద్ధిజీవులు "Bright English Weekly" అని ప్రశంసించడం, పీపుల్స్ ఫ్రెండ్ నుంచి నూరేళ్ళ హిందూ సంపుటం కోట్‌చెయ్యడం ఇందుకు నిదర్శనాలు.

1897 జూలై వరకు పీపుల్స్ ఫ్రెండ్ కొనసాగించి, ఆగస్టులో నెల్లూరు కాపురం వచ్చినట్లు నరసయ్య స్వయంగా పేర్కొన్నాడు.1 తను ఎంత గుండె బరువుతో నెల్లూరు ప్రయాణమై ఉంటాడో ఎవరి ఊహకైనా తట్టకపోదు. పదిహేడేళ్ళ క్రితం, ముప్పై రెండేళ్ళ వయసులో, నిక్షేపంలాంటి ప్రభుత్వోద్యోగం మానుకొని, ఎన్నో కలలు మూటగట్టుకొని మద్రాసు దారి పట్టాడు. జీవితం ఇంత నిష్ఠురంగా ఉంటుందని తనకు ముందే తెలుసు. తను ఎన్నుకొన్న మార్గం ఇతరులు నడవడానికి సాహసించనిది. చదువు, ఉద్యోగం, భద్రజీవితం ఈ వరుసలో తాను నడుచుకోలేదు. తన దారి వేరు.