పుట:Ecchini-Kumari1919.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కథా ముఖము

తెలుఁగునాఁట వెలసిన తొలినాఁటి 'నవలా' రచయితలలో శ్రీ . కేతవరపు వేంకట శాస్త్రిగారు మహోత్తమమైన స్థాన మలంకరించిరి. విశ్లేషించి, వా రేరుకొన్నవి కోరుకొన్నవి యగుగాథలు చారిత్రకములే. రాయచూరుముట్టడి, బొబ్బిలిముట్టడి; ఇత్యాదులు పెక్కు లరయునది. ప్రకృతము, ఈ 'ఇచ్చినీకుమారి' యుఁ జారిత్రకమే. ఇందలి కథ ' రాసమాల' యను ఘూర్జరదేశచరిత్రమునుండి సంగ్రహింపఁబడినది. అయిదాఱు పాత్రములు మాత్రము కల్పితములు. చరిత్ర-అచ్చముగా నున్నటులే వ్రాసికొనుచు వచ్చినచో నందమే యుండదు. కొన్ని మార్పులు చేర్పులు రచయిత చేయవలయును. శాస్త్రిగారు కూడ నీదారి నాశ్రయించినారు. కనుక నే యీ 'నవల' సుందరముగా నున్నయది.

ఇచ్ఛినికి నిజమైనహృదయము పృథ్వీరాజుమీఁద. భీమరాజు ఇచ్ఛినిని మోహించి, ఆమెను వలపింపఁజేయుటకుఁ బన్నుగడలు పన్నెను. ఎన్ని చేసినను, ఇచ్చినీ-పృథ్వీరాజుల వలపులే కడకు ఫలవంతములయినవి.

ధారావాహికమైన రచనతో నెంతో సంతనగా రసవంతముగా నున్న యీనవల క్లిష్టపదములు దీర్ఘసమాసములు లేక, ఉన్నతపాఠశాలావిద్యార్థులు పఠించుట కెంతయు ననుగుణముగా నున్నది.

రాజమహేంద్రవరము:

మధునాపంతుల సత్యనారాయణ

విరోధి: మధుమాసము:

శాస్త్రి