పుట:Dvipada-basavapuraanamu.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

బసవపురాణము

నందు దృష్టప్రత్యయంబులవలన
సందియంబులు దక్కి సద్భక్తియుక్తి 300
సుస్థిరలీల లింగస్థలజంగ
మస్థల తత్ప్రసాదస్థలంబులను
సంపన్ను లై జగజ్జను లెల్ల భక్తి
సొంపునఁ జుబ్బనఁజూఱలఁ దేల
నీవ ప్రసన్నుండ వై వచ్చి లోక
పావనంబుగ భక్తిఁ బాలింపవలయు”

—: శివుఁడు పార్వతితో నందికేశ్వరుని వృత్తాంతము చెప్పుట :—


నని విన్నవించిన నద్దేవదేవుఁ
డనురాగచిత్తుఁ డై యతని కి ట్లనియె :
"నందికేశ్వరునకు నాకు నొక్కింత
నందు లేకునికి నిస్సందేహ మగుట 310
నీతనిఁ బు త్తెంతు; నితనిచేఁ బరమ
పూతమై లోకంబు బోధంబు వడయు."
ననవుఁడు గిరిరాజతనయ ప్రాణేశుఁ
గనుఁగొని ముకుళితకరకంజ యగుచు
“నందికేశ్వరునకు నాకు నొక్కింత
నందు లేకునికి నిస్సందేహ మనుట
భక్తైకతనుఁడ వై పలికిన విధమొ ?
వ్యక్తిగా నతఁడు నీవై యన్న విధమొ
యానతి యి"మ్మని యంబిక యడుగ
నానారదుఁడు విన నభవుఁ డిట్లనియె : 320
“అగు నగు నట్టిద యంబుజనేత్రి !
తగుఁదగు భక్తైకతనుఁడ నట్లగుదుఁ ;
జెప్పెద వినుము విశేష మింకొకటి :
దప్ప దే నతఁ డని తర్కించి చూడ
నేమికారణ మనియెదవేని వినుము
తామరసానన ! తత్కథాయుక్తి :-