పుట:Dvipada-basavapuraanamu.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

బసవపురాణము

భవనిర్మితము లైన పత్రపుష్పములు
భవునకుఁ దగ సమర్పణ సేయునట్లు
గాక కీర్తింపఁగా నాకుఁ దరంబె
ప్రాకటంబుగ భక్తబండారి చరిత ! 250
మైనను లోకహితార్థంబు గాఁగ
నానేర్చుకొలఁది పర్జన సేయువాఁడ
నవరస రసికత భువిఁ బేరుగొన్న
శివకవి ప్రపరులచిత్తంబు లలర ;
నిప్పాట నితరులఁ జెప్పెడి దేమి ?
తప్పుడు దారులు దడఁబడఁ బలికి
వెలసిన చదువులు వీటిఁబో రిత్త
పొలిసిపోయిరి తమపురులు దూలఁగను
మృడుమహత్త్వముఁ గానమిని బొంకు లనఁగఁ
బడుఁ “గవయః కిం న పశ్యంతి " యనుట 260
యనుచుఁ గుకవుల గీటునఁ బుచ్చి పేర్చి
వినుతింతుఁ దత్కథావిధ మెట్టు లనిన :

కథారంభము

శ్రీకీర్తిసంచితాంచితవరభక్తి
సాకార ! వినమితామాత్య సంగాఖ్య :
శ్రీరజతాచలశృంగంబునందు
మారారి యుమయును మానితక్రీడఁ
దగిలినసుఖసంకథావినోదమున
సొగయుచు నున్నెడ శుద్ధశివైక
మానసు లగు నుపమన్యుఁడు భృంగి
యానందికేశ్వరుఁ డాదిగాఁ గల్గు 270
ప్రమథులు గొలువంగఁ బరిమితం బైన
సమయోచిత మెఱింగి చనుదెంచి ప్రీతి